ఆర్టీసీ ఆస్తులపై చర్చకొస్తరా

ఆర్టీసీ ఆస్తులపై చర్చకొస్తరా
  • రెఫరెండం పెడితే సమ్మె న్యాయమో కాదో తెలుస్తది
  • కేసీఆరే బాధ్యత తీసుకోవాలి
  • తప్పుడు కేసులకు బెదరం
  • సీఎం మాటలతోనే నల్గొండలో కార్మికుడి మృతి
  • కేసీఆర్​పైనా కేసులున్నయ్​: అశ్వత్థామరెడ్డి
  • కార్మికులకు 50 వేల జీతాలుంటే నిరూపించు: రాజిరెడ్డి
  • ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు:  వీఎస్‌‌రావు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :

ఎన్నికల కోసమే యూనియన్లు సమ్మెకు వెళ్లాయంటూ కేసీఆర్‌‌‌‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాము చేస్తున్న సమ్మె న్యాయమా కాదా అనేది రెఫరెండం పెట్టాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ అశ్వత్థామ రెడ్డి డిమాండ్‌‌‌‌ చేశారు. దీనికి స్వయంగా సీఎం కేసీఆరే బాధ్యత తీసుకోవాలన్నారు. ఆర్టీసీ ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమని, ప్రభుత్వం కూడా ప్రతినిధిని పంపాలని సవాల్‌‌‌‌ విసిరారు. ఆర్టీసీకి ఆస్తులే లేవంటున్నారని, మరి ఆస్తులన్నీ ఎవరెవరికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని టీఎంయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేసీఆర్‌‌‌‌ వ్యంగ్యంగా, అహంభావంతో, హాహాకారాలతో మాట్లాడుతున్నారని, ఇది సీఎం స్థాయికి తగదని సూచించారు. కేసీఆర్‌‌‌‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నల్గొండలో ఓ కార్మికుడు ఒత్తిడికి గురై చనిపోయాడని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఉండాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆటోమెటిక్‌‌‌‌గా యూనియన్లన్నీ రద్దయిపోతాయని తెలిపారు. ఎన్నికల కోసం తాము సమ్మె చేయడంలేదని, ఆర్టీసీని బతికించుకోవడానికి, సంస్థ ఆస్తులను కాపాడుకోవడానికే సమ్మెకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. 2013లో కరీంనగర్‌‌‌‌ సభలో కేసీఆర్‌‌‌‌ ఇచ్చిన హామీనే అమలు చేయాలని కోరుతున్నామన్నారు. తమ సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా కార్మికుల కోణంలో చూడాలని సూచించారు.

మాతో కూడా టచ్‌‌‌‌లో ఉన్నరు

యూనియన్ల నేతలు సీఎంకు టచ్‌‌‌‌లోఉంటే వారిని జాయిన్‌‌‌‌ చేసుకోవచ్చని, తమతో కూడా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్‌‌‌‌లో ఉన్నారని అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విమర్శలు చేయవచ్చని, తాను సీఎంను ఎక్కడా వ్యక్తిగతంగా తిట్టలేదని, ప్రభుత్వ తప్పుడు సమాచారంపైనే విమర్శించామని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ పాలిత రాష్ట్రాల్లో విలీనం చేశారా అని కేసీఆర్‌‌‌‌ ప్రశ్నిస్తున్నారని, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆర్టీసీకి ఫండ్స్‌‌‌‌ ఇచ్చి ఆదుకుంటున్నాయని గుర్తుచేశారు. ఏపీ సీఎం జగన్​ తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్​ అవహేళన చేసి మాట్లాడుతున్నారని, ప్రభుత్వంలో ఏపీఎస్​ ఆర్టీసీ విలీనంపై జగన్‌‌‌‌ జీవో విడుదల చేశారని ఆయన చెప్పారు. కేసీఆర్ ఎజెండా వేరు.. జగన్ ఎజెండా వేరన్నారు. ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు జగన్‌‌‌‌ వెయ్యి కోట్లు విడుదల చేశారని చెప్పారు. కేసీఆర్‌‌‌‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌‌‌‌ మంత్రిగా ఉన్నప్పుడు లాభాల్లో ఏం లేదు

కేసీఆర్‌‌‌‌ రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆర్టీసీ లాభాల్లో ఏమీ లేదని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ చరిత్రలో వైఎస్‌‌‌‌ రాజశేఖర రెడ్డి హయాంలో మాత్రమే లాభాల్లో ఉందని, అది కూడా పేపర్‌‌‌‌పైనే అని తెలిపారు. విద్య, వైద్యం ప్రైవేట్‌‌‌‌ అయ్యాక ఎంత దోపిడీ జరుగుతుందో, రవాణాది కూడా అదే పరిస్థితి అవుతుందని అన్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, 28న కలెక్టర్లకు వినతిపత్రాలు అందిస్తామని, 30న సకల జనుల సమరసభేరీ నిర్వహిస్తామని వెల్లడించారు.

అట్లయితే కలిసి ఎందుకు పోరాడుతం: రాజి రెడ్డి

ఎన్నికల కోసమే సమ్మెకు వెళితే, గుర్తింపు సంఘం అయిన టీఎంయూ, ప్రతిపక్షం అయిన ఈయూ కలిసి ఎలా పోరాడతాయని జేఏసీ కో కన్వీనర్‌‌‌‌ రాజిరెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌‌‌‌ అవాస్తవాలు, అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అద్దె బస్సులపై కిలోమీటర్‌‌‌‌కు 75 పైసల లాభం వస్తే, గతేడాది అవే బస్సులపై రూ. 140 కోట్ల నష్టం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కార్మికులకు 50 వేల జీతాలు ఉన్నాయని సీఎం అనడం హాస్యాస్పదంగా ఉందని, అలా ఉన్నట్లు నిరూపిస్తే వెంటనే సమ్మెను విత్ డ్రా చేసుకుంటామని చెప్పారు. సమస్యలు పరిష్కరించేదాకా సమ్మెను ఆగదని స్పష్టం చేశారు.

బహిరంగ చర్చకు రావాలి: వీఎస్‌‌‌‌రావు

ఆర్టీసీ బకాయిలుపై, అప్పులపై బహిరంగ చర్చకు రావాలని జేఏసీ కో కన్వీనర్‌‌‌‌ వీఎస్‌‌‌‌రావు సవాల్‌‌‌‌ విసిరారు. ఆర్టీసీకి రూ. 3024  కోట్ల నష్టం ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ చెప్పారని, ఇప్పుడు కేసీఆర్‌‌‌‌ మాత్రం రూ. 5 వేల కోట్ల అప్పులు ఉన్నాయని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు లెక్కలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని, కార్మికులకు, కార్మిక సంఘాల మధ్య విభేదాలు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆర్టీసీకి రూ. 2227 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని తెలిపారు. తమిళనాడులో ఆర్టీసీకి అక్కడి ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు.

Ashwathama Reddy demand that referendum on whether strike is legal or not