ఆ ముగ్గురే దెబ్బ కొట్టారు: భారత్ ఆలౌట్.. పాక్ ముంగిట సాధారణ లక్ష్యం

ఆ ముగ్గురే దెబ్బ కొట్టారు: భారత్ ఆలౌట్.. పాక్ ముంగిట సాధారణ లక్ష్యం

పసికూన బౌలర్లపై చెలరేగి ఆడే భారత బ్యాటర్లు.. కీలక పోరులో మాత్రం చేతులెత్తేశారు. పాకిస్తాన్ పేసర్లను ఎదుర్కోవడానికి నానా అవస్థలు పడ్డారు. ఆసియా కప్‌లో భాగంగా శనివారం దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా.. మరో ఏడు బంతులు మిలిగి ఉండగానే ఆలౌట్ అయ్యింది. పాకిస్థాన్ ముందు 267 పరుగుల సాధారణ విజయ లక్ష్యాన్ని నిలిపింది.

రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ.. బ్యాటింగ్‍లో మాత్రం దూకుడుగా ఆడలేకపోయాడు. పాకిస్తాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షాను ఎదుర్కోటానికి తెగ ఇబ్బంది పడ్డాడు. రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లీ 4, శ్రేయస్ అయ్యర్ 14, శుభ్ మన్ గిల్ 10.. ఇలా 66 పరుగులకే నలుగురు పెవిలియన్ చేరిపోయారు. అక్కడినుంచి టీమిండియా ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా తమ భుజాలపై వేసుకున్నారు. 

పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న వీరిద్దరూ.. ఇదో వికెట్ కు 138 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం దూకుడుగా ఆడే ప్రయత్నంలో కిషన్(82).. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో భారత జట్టు.. 38 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఆపై హార్దిక్ పాండ్యా(87), రవీంద్ర జడేజా(14), శార్దూల్ ఠాకూర్(3) వెంట వెంటనే ఔట్ కావడంతో 48.5 ఓవర్లలో 266 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 

పాక్ బౌలర్లలోషాహీన్ ఆఫ్రిది 4, హారిస్ రౌఫ్ 3, నసీం షా 3 వికెట్లు తీసుకున్నారు.