Asia Cup 2023: బ్యాడ్ న్యూస్.. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌ జరిగేది కష్టమే!

Asia Cup 2023: బ్యాడ్ న్యూస్.. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌ జరిగేది కష్టమే!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా - పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరిగేది అనుమానంగా మారింది. మ్యాచ్ జరగాల్సిన శ్రీలంకలోని పల్లెకెలె ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు మ్యాచ్ జరగాల్సిన శనివారం (సెప్టెంబర్ 2) కూడా వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు వాతవారణ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో దాయాదుల పోరు జరిగేది కష్టమే అన్న మాటలు వినపడుతున్నాయి.

ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు

సాధారణంగా శ్రీలంకలో ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. అందువల్ల లంక క్రికెట్ బోర్డు.. ఈ రెండు నెలల్లో విదేశీ పర్యటనలకు మొగ్గు చూపుతుంది. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఆసియా కప్ నే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ పల్లెకెలె వేదికగా 33 వన్డేలు జరగగా.. అందులో కేవలం 3 వన్డేలు మాత్రమే ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జరగడం గమనార్హం. దీన్ని బట్టి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయవచ్చు.

టికెట్లు కొన్న వారి పరిస్థితి ఏంటి..?

ఇండియా vs పాక్ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కనుక.. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే వర్షం ముప్పు పొంచి ఉండటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పూర్తి మ్యాచ్ జరగడానికి దాదాపు 10 గంటల సమయం ఉంటుంది కనుక.. అభిమానులకు ఎలాంటి బెంగ అక్కర్లేదు. 

వర్షం ఆగితే కనీసం ఒక్కో జట్టుకు 20 ఓవర్ల చొప్పున టీ20 మ్యాచ్ అయినా ఏక్సపెక్ట్ చేయవచ్చు. అది కూడా సాధ్యం కాకపోతే ఇరు జట్లకు సమానంగా పాయింట్లు కేటాయిస్తారు. అదే జరిగితే.. నేపాల్‌పై విజయం సాధించిన పాకిస్తాన్.. పాకిస్థాన్ నేరుగా సూపర్ 4కి అర్హత సాధిస్తుంది.