టీ20ల్లో గిల్‌‌ దారెటు? ఓపెనింగ్‌‌ కోసం అభిషేక్‌‌తో గట్టి పోటీ.. ఆసియా కప్‌‌కు ఎంపికపై సందిగ్ధత

టీ20ల్లో గిల్‌‌ దారెటు? ఓపెనింగ్‌‌ కోసం అభిషేక్‌‌తో గట్టి పోటీ.. ఆసియా కప్‌‌కు ఎంపికపై సందిగ్ధత
  • అడ్డంకిగా మారిన వెస్టిండీస్‌‌, సౌతాఫ్రికా టెస్ట్‌‌ సిరీస్‌‌
  • రెండు ఫార్మాట్లకే పరిమితమయ్యే చాన్స్‌‌

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌
ఇంగ్లండ్‌‌తో టెస్ట్‌‌ సిరీస్‌‌ను 2–2తో డ్రాగా ముగించి ప్రశంసలు అందుకున్న టీమిండియా టెస్ట్‌‌ కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌.. టీ20 ప్రణాళికలు ఏంటి? ఆసియా కప్‌‌ జట్టుకు అతన్ని ఎంపిక చేస్తారా? వెస్టిండీస్‌‌, సౌతాఫ్రికాతో టెస్ట్‌‌ సిరీస్‌‌ నేపథ్యంలో సెలెక్టర్ల నిర్ణయం ఎలా ఉండనుంది?  గిల్‌‌ లేనప్పుడు షార్ట్‌‌ ఫార్మాట్‌‌లోకి వచ్చిన ఓపెనర్లు ఇప్పటికే విజయం సాధించారు. వీటన్నింటి నేపథ్యంలో గిల్‌‌ దారి ఎటు వైపు వెళ్తుంది. అతన్ని ఎన్ని ఫార్మాట్‌‌లకు పరిమితం చేస్తారనే చర్చ కూడా మొదలైంది.

మరి దీనిపై హెడ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ ఆలోచనలు ఎలా ఉన్నాయనే దానిని కాసేపు పక్కనబెడితే.. ప్రస్తుతం ఉన్న ఫామ్‌‌ను పరిగణనలోకి తీసుకుంటే గిల్‌‌ను ఆసియా కప్‌‌ జట్టుకు ఎంపిక చేయాల్సిందే. టెస్ట్‌‌లపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో అతను ఓ ఏడాది పాటు ఇండియా తరఫున టీ20లు ఆడలేదు. ఫలితంగా అతని ప్లేస్‌‌లో కొత్తగా వచ్చిన కుర్రాళ్లు ఓపెనర్లుగా దుమ్ములేపారు. దాంతో గిల్‌‌ ప్లేస్‌‌ సందిగ్ధంలో పడింది. టెస్ట్‌‌ల్లో నాలుగో నంబర్‌‌లో ఆడించినట్లుగానే ఈ ఫార్మాట్‌‌లో కొనసాగించాలనుకుంటే పోటీ మరీ ఎక్కువగా ఉంది. 

రోహిత్‌‌ వారసుడిగా..
టీమిండియా ఆడే మూడు ఇంటర్నేషనల్‌‌ ఫార్మాట్లలో రెండింటిలో గిల్‌‌ స్థానానికి ఢోకా లేదు. ఇందులో ఒకటి టెస్ట్‌‌ ఫార్మాట్‌‌. ఇప్పటికే ఇందులో తానేంటో నిరూపించుకున్నాడు. కాకపోతే ఆ రెండో ఫార్మాట్‌‌ ఏదనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా వన్డే కెప్టెన్‌‌గా రోహిత్‌‌ శర్మ కొనసాగుతున్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌‌ తర్వాత హిట్‌‌మ్యాన్‌‌ ఈ ఫార్మాట్‌‌ను కూడా వదిలేస్తే గిల్‌‌కు లైన్‌‌ క్లియర్‌‌ అయినట్లే. ఎందుకంటే 50 ఓవర్ల ఫార్మాట్‌‌లో గిల్‌‌ను కొట్టే మొనగాడు లేడు.

2023 వన్డే వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్‌‌, 2025 చాంపియన్స్‌‌ ట్రోఫీ ఫైనల్లో గిల్‌‌ కీలక పాత్ర పోషించాడు. కాబట్టి టీమ్‌‌లో ప్లేస్‌‌తో పాటు కెప్టెన్సీ అటోమేటిక్‌‌గా దక్కుతాయి. కానీ దానికంటే ముందు ఆసియా కప్‌‌ రావడంతో టీ20 ఫార్మాట్‌‌పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం తలెత్తింది. ఎందుకంటే 2026 టీ20 వరల్డ్‌‌ కప్‌‌కు సన్నాహకంగా దీన్ని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న గిల్‌‌ను ఆడించకపోతే టీమిండియా చాలా నష్టపోతుందని విశ్లేషకుల వాదన.

ఐపీఎల్‌‌లోనూ గిల్‌‌ 156 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో 650 రన్స్‌‌ చేశాడు. కాబట్టి రాబోయే పదేళ్లు టీమిండియా క్రికెట్‌‌కు గిల్‌‌ ఓ మూలస్తంభంగా ఉండబోతున్నాడు. మరి ఇలాంటి అద్భుతమైన టైమ్‌‌లో అతన్ని ఎన్ని ఫార్మాట్లలో ఆడిస్తారనేది ఇప్పుడు సెలెక్టర్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న. మరోవైపు 2024 టీ20 వరల్డ్‌‌ కప్‌‌ తర్వాత ఇండియా పూర్తి స్థాయి టీ20 జట్టును బరిలోకి దించలేదు. గతేడాది జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌‌కు గిల్‌‌ కెప్టెన్‌‌గా వ్యవహరించాడు. ఇక జులైలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌‌కు వైస్‌‌ కెప్టెన్‌‌గా పని చేశాడు. అయితే టెస్ట్‌‌లపై దృష్టి పెట్టేందుకు బంగ్లాదేశ్‌‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌తో జరిగిన టీ20లకు గిల్‌‌ను ఎంపిక చేయలేదు. 

షెడ్యూల్స్‌‌తోనే సమస్య..
ఒకవేళ ఆసియా కప్‌‌కు గిల్‌‌ను ఎంపిక చేస్తే.. దాని ప్రభావం వెస్టిండీస్‌‌, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌‌పై పడే చాన్స్‌‌ ఉంది. ఎందుకంటే ఆసియా కప్‌‌ ఫైనల్‌‌ సెప్టెంబర్‌‌ 28న జరుగుతుంది. ఒకవేళ ఇండియా ఫైనల్‌‌కు చేరితే తప్పకుండా ఈ మ్యాచ్‌‌లో పూర్తి స్థాయి జట్టు బరిలోకి దిగాల్సిందే. కానీ ఆ వెంటనే అంటే అక్టోబర్ 2న స్వదేశంలో వెస్టిండీస్‌‌తో టెస్ట్‌‌ సిరీస్‌‌ మొదలవుతుంది. ఇందులోనూ గిల్‌‌ కచ్చితంగా ఆడాల్సిందే. 

ఆ తర్వాత వన్డే సిరీస్‌‌ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రాగానే మళ్లీ సౌతాఫ్రికాతో టెస్ట్‌‌ సిరీస్‌‌. ఇలా వరుసగా మ్యాచ్‌‌లు ఉండటంతో గాయాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువే. ఓ వైపు కెప్టెన్‌‌గా... మరోవైపు బ్యాటర్‌‌గా.. ఈ రెండింటి మధ్య ఫార్మాట్లకు అనుగుణంగా ఆటను మార్చుకోవడం ఎవరికైనా కత్తిమీద సామే.

అభిషేక్‌‌ వైపే మొగ్గు..
ఆగస్టు 2024 నుంచి గిల్‌‌ టీ20లు ఆడలేదు. ఆ టైమ్‌‌లో టీమ్‌‌లోకి వచ్చిన అభిషేక్‌‌ శర్మ అద్భుతంగా ఆడాడు. ఓపెనర్‌‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌‌తో జరిగిన టీ20 సిరీస్‌‌లో 220 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో 279 రన్స్‌‌ చేశాడు. అదే టైమ్‌‌లో సంజూ శాంసన్‌‌కు కూడా చాన్స్‌‌ వచ్చినా సగమే సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి గిల్‌‌కు అభిషేక్‌‌ నుంచి గట్టి పోటీ ఉంటుంది. దూకుడు, స్థిరమైన ఓపెనింగ్‌‌ కలయిక కావాలని సెలెక్టర్లు కోరుకుంటే అప్పుడు శాంసన్‌‌ ప్లేస్‌‌లో గిల్‌‌కు చాన్స్‌‌ దక్కొచ్చు. ఇక జైస్వాల్‌‌ పరిస్థితి కూడా దాదాపు గిల్‌‌లాగే ఉంది. జులై 2024 నుంచి అతనూ టీ20లు ఆడలేదు. దీనికి కారణం టెస్ట్‌‌లే. 2024 టీ20 వరల్డ్‌‌ కప్‌‌కు జైస్వాల్‌‌ను బ్యాకప్‌‌ ఓపెనర్‌‌గా తీసుకున్నా ఒక్క మ్యాచ్‌‌ కూడా ఆడించలేదు.

రోహిత్‌‌, విరాట్‌‌ ఓపెనర్లుగా కుదురుకోవడం వల్ల చాన్స్‌‌ రాలేదు. అయితే ఐపీఎల్‌‌లో జైస్వాల్‌‌ పెర్ఫామెన్స్‌‌ అనుకున్నంతగా లేదు. ఓవరాల్‌‌గా టీ20 వరల్డ్‌‌ కప్‌‌ను దృష్టిలో పెట్టుకుని ఆసియా కప్‌‌ కోసం సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. అయితే ఓపెనింగ్‌‌ కోసమే గిల్‌‌, జైస్వాల్‌‌, అభిషేక్‌‌, శాంసన్‌‌ను ఎంపిక చేయడం మాత్రం చాలా కష్టం. ఇతర ప్లేయర్లకూ బ్యాకప్‌‌ అవసరం ఉంటుంది కాబట్టి.. ఒకవేళ ఆ రకంగా ఏమైనా ట్రై చేస్తారేమో చూడాలి.