జకర్తా: ఆసియా కప్‌లో ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఇండియా మెన్స్ హాకీ టీమ్ డ్రాతో సరిపెట్టుకుంది. దీంతో మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలన్న ఆశలు గల్లంతయ్యాయి. మంగళవారం సూపర్–4లో భాగంగా సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను ఇండియా 4–4తో డ్రా చేసుకుంది. దీంతో టీమిండియా టైటిల్ రేస్ నుంచి వైదొలిగింది. ఇప్పుడు కేవలం బ్రాంజ్ మెడల్ కోసం బరిలో నిలిచింది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో మలేసియా 5–0తో జపాన్‌పై గెలవడంతో కొరియాపై ఇండియా కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, అది సాధ్యం కాలేదు. సూపర్–4లో ఇండియా, మలేసియా, కొరియా తలా ఐదు పాయింట్లతో నిలిచినా.. ఒక్క గోల్ డిఫరెన్స్‌తో లక్రా బృందం మూడో ప్లేస్‌కు పరిమితమైంది. మలేసియా, కొరియా ఫైనల్ చేరుకున్నాయి. కొరియాతో మ్యాచ్‌లో ఇండియా తరఫున నీలమ్ సంజీప్ (9వ ని.), డిప్సన్ టిర్కే (21వ ని.), మహేశ్ శషీ గౌడ (22వ ని.), శక్తివేల్ (37వ ని.) గోల్స్ చేశారు. జంగ్ జంగ్‌యున్ (13వ ని.), జీ వు చియో (18వ ని.), కిమ్ జుంగ్ హో (28వ ని.), జుంగ్ మంజీ (44వ ని.) కొరియాకు గోల్స్ అందించారు. కాగా, బుధవారం జరిగే ఫైనల్లో కొరియా, మలేసియా తలపడతాయి. బ్రాంజ్ మెడల్ కోసం జరిగే మ్యాచ్‌లో జపాన్‌తో ఇండియా పోటీపడుతుంది.
