ధారావిలో ఒక్కరోజే 15 కరోనా కేసులు

ధారావిలో ఒక్కరోజే 15 కరోనా కేసులు

ఆసియాలోనే అతిపెద్ద స్ల‌మ్ ఏరియా అయిన‌ ముంబైలోని ధారావి లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ ఆదివారం ఒక్క‌రోజే 15 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతం నుండి క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య‌ మొత్తం 43 కి చేరింది. ధారావిలో ఇప్పటివరకు నాలుగు మరణాలు సంభవించాయి. అయితే ఈ వైర‌స్ ను నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది.

ఆదివారం నమోదైన ఈ 15 కొత్త కేసులలో తొమ్మిది మంది.. అంతకుముందు కరోనా వైరస్ బారిన ప‌డి మ‌ర‌ణించిన‌ బాధితుడి పరిచయస్తులు. కేసుల సంఖ్య పెరగడంతో, అధికారులు ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా మహారాష్ట్రలో కొత్తగా 134 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క‌ ముంబైలోనే 113 మందికి ఈ వైర‌స్ సోకినట్లు తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో 1,895 కేసులు నమోదయ్యాయి.