హెచ్1బీ వీసాలపై ఇండియన్ టెకీలకు ఊరట

హెచ్1బీ వీసాలపై ఇండియన్ టెకీలకు ఊరట
  • లక్ష డాలర్ల ఫీజు కొత్త అప్లికేషన్లకే.. ప్రస్తుత హెచ్1బీ వీసా హోల్డర్లు, రెన్యువల్స్​కు వర్తించదు
  • వీసాదారులు స్వేచ్ఛగా విదేశాలకు వెళ్లి రావొచ్చు 
  • హెచ్1బీ వీసా రూల్స్ మార్పుపై వైట్​హౌస్ వివరణ 
  • కొత్త పిటిషన్లకే లక్ష డాలర్లు చెల్లించాలి 
  • అది కూడా వార్షిక ఫీజు కాదని.. వన్ టైం ఫీజు అని వెల్లడి  
  • ఇండియన్ టెకీలకు రిలీఫ్

వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై ఇండియన్ టెకీలకు ఊరట లభించింది. కొత్తగా హెచ్1బీ వీసాల కోసం వచ్చే అప్లికేషన్లకు మాత్రమే లక్ష డాలర్ల (రూ. 88 లక్షలు) ఫీజు నిబంధన వర్తిస్తుందని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పటికే హెచ్1బీ వీసాలు పొందినోళ్లకు, రెన్యువల్ చేసుకునేటోళ్లకు మాత్రం పాత రూల్సే వర్తిస్తాయని ప్రకటించారు. హెచ్1బీ వీసాలను యూఎస్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, అందుకే ఈ వీసాలపై వార్షిక ఫీజును 2 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతున్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రొక్లమేషన్  (ప్రకటన)పై సంతకం చేయడంతో ఇండియన్ టెకీల్లో కలకలం రేగింది.

ఆదివారం తెల్లవారుజామున 12.01 గంటల నుంచే కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని, ఈ డెడ్ లైన్ దాటిన తర్వాత హెచ్1బీ వీసాదారులు అమెరికాలోకి ఎంట్రీ కావాలన్నా లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనన్న ప్రచారంతో తీవ్ర గందరగోళం సాగింది. ఈ నేపథ్యంలో శనివారం వైట్ హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోగర్స్ ‘పీటీఐ’ వార్తా సంస్థకు వివరణనిచ్చారు. అలాగే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ కూడా ‘ఎక్స్’ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘‘లక్ష డాలర్ల ఫీజు కేవలం కొత్త పిటిషన్లకే వర్తిస్తుంది. అలాగే ఇది వార్షిక ఫీజు కాదు. ఒక్కో పిటిషన్ పై వసూలు చేసే వన్ టైమ్ ఫీజు మాత్రమే. అలాగే 2025 లాటరీ విన్నర్స్ కు కూడా ఫీజు పెంపు వర్తించదు. వచ్చే లాటరీ సైకిల్ కు మాత్రమే వర్తిస్తుంది” అని వారు పేర్కొన్నారు.

అమెరికాలోకి ఎంట్రీపై వారికి ఆంక్షల్లేవ్..
డెడ్ లైన్ దాటిన తర్వాత హెచ్1బీ వీసాల కోసం వచ్చే కొత్త పిటిషన్లకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో కూడా ఒక ప్రకటనలో తెలిపారు. డెడ్ లైన్ కు ముందు దాఖలైన పిటిషన్లకు పాత ఫీజు నిబంధనలే వర్తిస్తాయని పేర్కొన్నారు. అమెరికా వెలుపల ఉన్న హెచ్1బీ వీసా హోల్డర్లు వెంటనే తిరిగి రావాల్సిన అవసరం లేదని, అమెరికాలో ఉన్న వారు విదేశాలకు వెళ్లడంపై కూడా ఎలాంటి ఆంక్షలు లేవని వివరించారు.

ఈ విషయంలో గైడ్ లైన్స్ ను కచ్చితంగా పాటించాలని ఇమిగ్రేషన్ ఆఫీసర్లందరికీ ఆదేశాలు జారీ చేశామన్నారు. కాగా, హెచ్1బీ వీసా ఫీజు లక్ష డార్లకు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆదివారం తెల్లవారుజామున 12.01 గంటల నుంచే అమలులోకి వచ్చింది. ఇకపై కొత్తగా వచ్చే హెచ్1బీ పిటిషన్లకు స్పాన్సర్డ్ కంపెనీలు లక్ష డాలర్ల ఫీజును చెల్లించకపోతే ఆ పిటిషన్లు రిజెక్ట్ కానున్నాయి.