- కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్, వెలుగు: స్టూడెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అధికారులకు సూచించారు. శనివారం రెబ్బెన మండలం గంగాపూర్‌లోని కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించి కిచెన్, క్లాస్‌రూమ్స్, రిజిస్టర్, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.
టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్ ను సందర్శించి హాజరు రిజిస్టర్ పరిశీలించారు. ఉపాధి హామీ కార్యాలయాన్ని సందర్శించి కూలీలకు కల్పిస్తున్న పని దినాల రిజిస్టర్‌ను పరిశీలించి, పని దినాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామపంచాయతీని సందర్శించి నర్సరీ నిర్వహణను పరిశీలించారు. సకాలంలో నీటిని అందించి మొక్కలను సంరక్షించాలని నిర్వాహకులకు సూచించారు. మండలంలోని పులికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, స్కూల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని టీచర్లకు సూచించారు. పీహెచ్‌సీని సందర్శించి వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.
ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని.. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి రికార్డులు, కల్యాణలక్ష్మి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, పనుల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. అనంతరం కొండపల్లి గ్రామపంచాయతీని సందర్శించారు.
ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి
ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ, అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో సీఆర్ పీలు, కృషి సఖిలకు ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. భావితరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని, ప్రకృతి సేద్యం చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
అధిక మోతాదులో యూరియా, డీఏపీ వాడకాన్ని నియంత్రించుకోవాలని, పశువుల పేడ, సేంద్రియ ఎరువులను వినియోగించి పంట సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు.
