ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు : కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే

ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు : కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే
  •     లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో కలెక్టర్లు
  •     అధికారులతో సమావేశమై మార్గదర్శకాలు
  •     ప్రజలు రూ.50 వేలకు మించి తీసుకెళ్లొద్దని సూచన

ఆసిఫాబాద్/ నిర్మల్/నస్పూర్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల కోడ్​ను పకడ్బందీగా అమలు చేస్తామని, కోడ్​ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో శనివారం ఎస్పీ సురేశ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఏఎస్పీ ప్రభాకర్ రావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.

జిల్లాలో 4,55,437 మంది ఓటర్లు ఉన్నారని, ఒక్క ఓటరు కూడా తప్పకుండా నమోదు ప్రక్రియ కొనసాగడానికి స్వీప్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫిర్యాదు కోసం సి విజిల్ యాప్ అందుబాటులో ఉంటుందని, ఎన్నికల్లో జరిగే అవకతవకలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజలు రూ.50 వేల కంటే అదనంగా వెంట తీసుకెళ్తే దానికి సంబంధించిన రసీదు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. 

అడుగడుగునా నిఘా..

నిర్మల్ జిల్లాలో లోక్ సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని, అడుగడుగునా నిఘా ఏర్పాటు చేస్తామని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.  అధికారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో మొత్తం 7 లక్షల 34 వేల 828 మంది ఓటర్లు ఉన్నారన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో అత్యధికంగా 2 లక్షల 57 వేల 248 మంది, ముథోల్​లో 2లక్షల 53 వేల 793 మంది, ఖానాపూర్​లో 2 లక్షల 23 వేల783 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 922 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.

50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ పోలింగ్ స్టేషన్​ను ఎంపిక చేశామని చెప్పారు. జిల్లాలోకి అక్రమ డబ్బు, అక్రమ మద్యం ప్రవేశపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి డబ్బు, మద్యం రాకుండా అడ్డుకునేందుకు జిల్లాలో 7 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.  

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి

ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఖచ్చింతంగా అమలు చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్టు, అడిషనల్ కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, ఫొటోలు, వాల్ రైటింగ్స్, పోస్టర్లు, ఫ్లెక్సీలు, ప్లాగ్స్ పూర్తిగా తొలగించాలని అదేశించారు.

ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణకు నిబంధనల ప్రకారం అనుమతులు  జారీ చేయాలన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డీఓ రాములు, ఎల్ఏఆర్ అండ్ ఆర్ ప్రత్యేక ఉప పాలనాధికారి చంద్రకళ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.