కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి : ఆత్రం సుగుణ

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి : ఆత్రం సుగుణ
  • డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ

ఆసిఫాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషిచేయాలని ఆసిఫాబాద్​ డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ కోరారు. సోమవారం రెబ్బెనలోని కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గం ఇన్​చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మండల అధ్యక్షుడు లావుడే రమేశ్​ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశంలో సుగుణ పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పార్టీపై మరింత విశ్వాసం పెంపొందించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషిచేయాలని.. గ్రామస్థాయి సమస్యలకు స్పందిస్తూ పనిచేయాలని సూచించారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలన్నారు.ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి రెబ్బెన మండల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కోరుతానని సుగుణ హామీ ఇచ్చారు.

సోనియా, రాహుల్​పై కొత్త ఎఫ్ఐఆర్ నమోదును ఖండించిన సుగుణ

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడాన్ని డీసీసీ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 

దేశంలో వారిపై పెరుగుతున్న ప్రజాభిమానం, కాంగ్రెస్​కు పెరుగుతున్న మద్దతుతో భయభ్రాంతులకు గురైన కేంద్రంలోని బీజేపీ అభద్రతా భావంతో తమ అగ్ర నేతలను టార్గెట్ చేస్తోందని సుగుణ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు పనిచేయవని, కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంతో ప్రజా సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.