
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలు, సెర్ప్ ఎపీఎంలు, హౌసింగ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, బ్యాంకు లింకేజీ ద్వారా లబ్ధిదారులకు రుణ సదుపాయం, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, పారిశుద్ధ్య పనులపై దిశాని ర్దేశం చేశారు. జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, 100 శాతం ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
బేస్మెంట్ నిర్మాణం ఆలస్యం చేసే వారిని గుర్తించి బ్యాంకు లింకేజీ, మండల సమాఖ్య ద్వారా రూ.లక్ష రుణం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం కింద పీవీటీజీలకు ఇండ్లు మంజూరు చేస్తున్నామని, అర్హులైన లబ్ధిదారుల జాబితా అందించాలని తెలిపారు.