పంట మార్పిడికి ఆదివాసీ రైతుల మొగ్గు

పంట మార్పిడికి ఆదివాసీ రైతుల మొగ్గు
  • ఆసిఫాబాద్​ జిల్లాలో పంట మార్పిడికి ఆదివాసీ రైతుల మొగ్గు
  • ప్రయోగాత్మకంగా 6,080 ఎకరాల్లో సాగుకు ఏర్పాట్లు
  • ప్రోత్సహిస్తున్న కలెక్టర్​ రాహుల్​
  •  పదేండ్లుగా పత్తితో తీవ్ర నష్టాలు.. 
  • వాటి నుంచి బయటపడేందుకు మిల్లెట్ల వైపు రైతుల చూపు

ఆసిఫాబాద్, వెలుగు: కొన్నేండ్లుగా పత్తి పంట వేసి కష్ట, నష్టాలపాలైన ఆదివాసులు ఈసారి చిరుధాన్యాలు సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండుకొర్రలు వంటివి పండించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో  పదేండ్లుగా హెచ్​టీబీటీ పత్తి విత్తనాలు సాగుచేయడం వల్ల భూములు సారం కోల్పోయాయి. దీంతో ఎకరాకు 2.5 నుంచి 3 క్వింటాళ్ల పత్తి కూడా చేతికి రాక గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదేవిధంగా ఆదివాసీ చిన్నారులు, మహిళలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈసారి ప్రయోగాత్మకంగా జిల్లాలోని గిరిజన రైతులతో 6,080 ఎకరాల్లో చిరు ధాన్యాలు సాగుచేయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఉచితంగా సీడ్స్ అందించేందుకు అధికారులిద్దరూ ముందుకురావడంతో గిరిజనులు కూడా ఉత్సాహంగా సాగుకు సై అంటున్నారు. 

నిస్సారంగా భూములు..

రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా గుర్తింపుపొందిన ఆసిఫాబాద్​లో 4.5 లక్షల ఎకరాల సాగుభూములున్నాయి. అటవీప్రాంతం కావడం, సాగునీటి వసతి లేకపోవడంతో కేవలం వర్షాధార పంటలపైనే ఇక్కడి గిరిజన రైతులు ఆధారపడుతారు. గతంలో రాగులు, సజ్జలు , జొన్నలు తదితర చిరుధాన్యాలు సాగుచేసి, వాటినే ఆహారంగా ఉపయోగించేవారు. కానీ పదేండ్లుగా మెజారిటీ గిరిజన రైతులు చిరుధాన్యాలను బంద్​పెట్టి ఏకంగా 3.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేస్తూ వచ్చారు. దళారుల ద్వారా అందే హెచ్​టీబీటీ పత్తి విత్తనాలు సాగుచేయడం వల్ల గులాబీ పురుగు ఉధృతి తీవ్రమై నష్టపోతున్నారు. గ్లైపోసెట్​గడ్డి మందును పదే పదే పిచికారీ చేయడం వల్ల భూములు నిస్సారమయ్యాయి. పంట మార్పిడిని కూడా మరిచిపోయారు. ఈక్రమంలో రెండు, మూడేండ్లుగా ఎకరాకు  2 నుంచి 3 క్వింటాళ్ల లోపే పత్తి దిగుబడి వస్తుండడంతో పెట్టుబడులకు కూడా మునుగుతున్నారు.  

మహిళలు, చిన్నారులలో పోషకాహార లోపం..

గతంలో చిరుధాన్యాలు పండించుకొని వాటిని ఆహారంలో భాగంగా చేసుకున్న గిరిజనులు.. పదేండ్లుగా పత్తి పండిస్తూ ప్రభుత్వం ఇచ్చే రేషన్​ బియ్యం తింటున్నారు. అందులోకి కూరలు సరిగ్గా లేక, పచ్చడి మెతుకులు తినడం వల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో ఈ జిల్లాలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది. ప్రసవానికి వెళ్లిన మహిళ, పుట్టిన బిడ్డతో తిరిగివస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఈ​జిల్లాలో ఏటా 100కుపైగా  మాతాశిశు మరణాలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 877 మంది తక్కువ బరువుతో పుట్టారు.  ఇలా పత్తి సాగులో పడి అటు దిగుబడులు రాక, ఇటు పోషకారలోపంతో బాధపడుతున్న గిరిజనులను పాత పంటల దిశగా మళ్లించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్ణయించారు. గతేడాది కూడా కొన్ని ఏరియాల్లో మిల్లెట్స్​ సాగుచేయించడంలో సక్సెస్​ అయిన కలెక్టర్​కు ఈ విషయంలో  ఎక్సెలెన్సీ  అవార్డు కూడా దక్కింది. 

మిల్లెట్స్ సాగుకు ఏర్పాట్లు

ఈసారి 6,080 ఎకరాల్లో కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండుకొర్రలు, రాగులు పంటలను గిరిజన రైతులతో సాగు చేయించాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​ నిర్ణయించారు.  ప్రస్తుతం భూములు, రైతుల ఎంపిక ప్రక్రియ నడుస్తుండగా, విత్తనాలను ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి జిల్లావ్యాప్తంగా 2,500 మంది రైతులను ఎంపిక చేస్తారు. మిల్లెట్స్​ సాగుచేసే రైతులకు ప్రోత్సాహంగా మొత్తం131 క్వింటాళ్ల సీడ్స్​ అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం తరుపున రూ.15 లక్షల 13 వేలు ఖర్చు చేసి రైతులకు వంద శాతం సబ్సిడీతో ఫ్రీగా అందించనున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులను పర్యవేక్షిస్తూ కావాల్సిన సూచనలు, సలహాలు అందిస్తారు. పండిన పంటలో ఆయా రైతులు ఇంటి అవసరాలకు పోగా మిగిలిన మిల్లెట్స్​ను అధికారులే మద్దతు ధరకు సేకరించి, అంగన్​వాడీ కేంద్రాల్లో సప్లయ్​ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సక్సెస్​రేటును బట్టి వచ్చే ఏడాది  50వేల ఎకరాల వరకు  సాగుచేసే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.

ఈసారి పత్తి బంద్​వెడ్తున్న.. 

పత్తితో మస్తు లాసైతు న్నది. ఈసారి పత్తి బంద్​వెట్టి ఆఫీసర్లు చెప్పినట్లు జొన్నలు, సజ్జలు లాంటి చిరుధాన్యాలతోపాటు కందులు, పెసర్లు లాంటి పప్పులు కూడా వేస్తం. వీటితోనే మంచి లాభాలున్నయని అంటున్నరు. ఇప్పుడంతా ఇవ్వే తింటున్నరట. 
- కోట్నాక పాండు, రైతు ,తిర్యాణి

చిరుధాన్యాలే మంచివి..

పత్తి, మిరప పంటలకంటే చిరుధాన్యాల సాగే మంచిది. ఆఫీసర్లు చెప్తే నిరుడు కూడా సజ్జలు, ఊదలు, జొన్నలు సాగు చేసిన. పెట్టుబడి తక్కువ, దిగుబడి బాగుంది. అందుకే ఈసారి కూడా చిరుధాన్యాలు సాగుచేద్దామని అనుకుంటున్న. 

- మాడవి నర్సింగ్​, రైతు,  పోచంలొద్ది, జైనూర్

ప్రయోగాత్మకంగా సాగు.. 

ఆసిఫాబాద్​ జిల్లాలో చిరు ధాన్యాల సాగుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు. ఈసారి సక్సెస్​ అయితే వచ్చే ఏడాది మరింత పెంచుతం. చిరుధాన్యాల సాగు లాభసాటిగా ఉంటుంది. వందశాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నం.

-శ్రీనివాస్ రావు , ఏడీఏ, ఆసిఫాబాద్