పెట్రోల్ బంకులో బైక్తో ఫీట్లు.. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడి వీడియో వైరల్

పెట్రోల్ బంకులో బైక్తో ఫీట్లు.. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడి వీడియో వైరల్

హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడు శివ శంకర్ ప్రమాదానికి ముందు ఓ పెట్రోల్ బంకులో హల్చల్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో పెట్రోల్ బంకులో బైక్ను శంకర్ గిర్రున తిప్పిన దృశ్యాలు కనిపించాయి. శంకర్ బైక్పై అతనితో పాటు మరో యువకుడు కూడా కనిపించాడు. బైక్పై అలా స్టంట్స్ చేయడంతో బండి స్కిడ్ అయింది. బైక్ నడిపిన తీరు చూస్తుంటే శంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెల్లవారుజామున 2 గంటల 22 నిమిషాలకు పెట్రోల్ బంకులో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బైక్ ప్రమాదానికి గురైన శివశంకర్ మృతదేహాన్ని అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. బైక్ ప్రమాదానికి గురైన శివశంకర్ పెట్రోల్ బంక్లో స్టంట్ చేసి, మద్యం మత్తులో ఊగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బైక్‌ను బస్సు ఢీకొట్ట లేదని కర్నూలు జిల్లా ఎస్పీ చెప్పుకొచ్చారు. బస్సు వచ్చేటప్పటికే రోడ్డుపై బైక్ పడి ఉందని, డ్రైవర్‌ చూసుకోకుండా బైక్‌ పైకి బస్సును పోనిచ్చాడని ఎస్పీ తెలిపారు. బస్సు కింద బైక్ ఇరుక్కుపోవడంతో డ్రైవర్ ఆపేశాడని, బైక్‌ను వేరే వాహనం ఏదైనా ఢీ కొట్టిందా, సెల్ఫ్ యాక్సిడెంటా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని కర్నూలు ఎస్పీ వెల్లడించారు. బస్సు కింద బైక్ ఇరుక్కుపోవడంతో ఆ రాపిడికి నిప్పురవ్వలు చెలరేగాయని, బస్సు ఆపగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించి.. చూస్తుండగానే బస్సు పూర్తిగా తగలబడిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలను మీడియాకు తెలియజేశారు.