- ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులకు టీసీలు ఇచ్చిన హెచ్ఎం
- బాధితుడూ టీసీ తీసుకొని వెళ్లిపోయాడు..
- మస్కాపూర్ లో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
ఖానాపూర్, వెలుగు: మస్కాపూర్ లోని బీసీ వెల్ఫేర్ బాలుర హాస్టల్ లో ఉంటున్న ఆరోతరగతి విద్యార్థిపై అదే హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురూ మస్కాపూర్ లోని జడ్పీ సెకండరీ పాఠశాలలో చదువుతున్నారు. కాగా, బాధిత ఆరోతరగతి విద్యార్థి తనపై ఈ నెల 21న రాత్రి జరిగిన లైంగిక దాడి, వేధింపులపై హాస్టల్ ట్యూటర్, స్కూల్హెచ్ఎంకు ఫిర్యాదు చేశాడు.
హెడ్ మాస్టర్ నరేందర్విచారణ జరిపి, తొమ్మిదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించారు. వేధింపుల విషయాన్ని వారికి చెప్పి, ప్రవర్తన సక్రమంగా లేని కారణంగా ఇద్దరికీ ఈ నెల 23న టీసీ ఇచ్చి పంపించారు.
అయితే, లైగింక వేధింపులకు గురైన విద్యార్థి కూడా భయంతో తాను ఇక్కడ చదవలేనని టీసీ తీసుకొని వెళ్లిపోయాడు. ఇలాంటి ఘటనల ప్రభావం మిగతా పిల్లలపై పడకూడదన్న ఉద్దేశంతోనే వారికి టీసీలు ఇచ్చినట్లు హెచ్ఎం తెలిపారు.
