ఆసిఫాబాద్, వెలుగు: ఆన్లైన్లో మోసానికి పాల్పడ్డ నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది జూన్ 4న ఓ టెలిగ్రామ్ లింక్ వచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని మెసేజ్ రావడంతో నమ్మి క్లిక్ చేశారు. దీంతో అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.1,66,267 మాయమయ్యాయి.
దీంతో బాధితుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆసిఫాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్, సిబ్బంది దర్యాప్తు చేపట్టి, బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి పోగొట్టుకున్న మొత్తంలో రూ.60,582 హోల్డ్ చేయించారు. మిగతా డబ్బులు ఏయే ఖాతాల్లో జమయ్యాయో గుర్తించారు.
మోసానికి పాల్పడ్డ గుజరాత్ కు చెందిన నిందితులు పంకజ్ లాలజీ భాయ్ కనాని, శైలేశ్సల్లుభాయ్ అనే ఇద్దరు నిందితులను గత నెల 26న అరెస్ట్ చేసి, ఆసిఫాబాద్‌కు తరలించి రిమాండ్ చేశారు. తదుపరి విచారణలో శైలేష్ ఇచ్చిన సమాచారంతో మూడో నిందితుడు బీకాం విద్యార్థి మిథుల్ భాయ్‌గా గుర్తించారు.
ఆసిఫాబాద్ పోలీసులు మిథుల్ భాయ్ స్వగ్రామం గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా పాలితన తాలూకా, కాకారియాకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్‌కు తీసుకొచ్చి బుధవారం కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల అరెస్టుకు కృషి చేసిన టౌన్ సీఐ, సిబ్బంది, డీ-ఫోర్ సీ బృందాన్ని అభినందించారు.
