అన్నీ గమనిస్తున్నాం.. నకిలీ జోలికి పోకండి : ఎస్పీ సురేశ్

అన్నీ గమనిస్తున్నాం.. నకిలీ జోలికి పోకండి : ఎస్పీ సురేశ్
  •     ఎస్పీ సురేశ్ కుమార్ హెచ్చరిక 

కాగజ్ నగర్, వెలుగు:  రైతులు బాగుంటేనే సమాజం, దేశం బాగుంటుందని.. వాళ్లను మోసం చేస్తే ఊరుకునేది లేదని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ హెచ్చరించారు. శనివారం కాగజ్ నగర్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో డివిజన్ లోని ఎరువులు, విత్తనాల డీలర్లు, ఫర్టిలైజర్ డీలర్లతో సదస్సు నిర్వహించారు. కాగజ్ నగర్ ఆర్డీవో, జిల్లా ఇన్​చార్జి వ్యవసాయాధికారి కృష్ణారెడ్డి, కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, ఏడీఏ మనోహర్​తో కలిసి ఆయన మాట్లాడారు. విత్తన అక్రమ దందాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. 

విత్తన డీలర్లు, ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు నకిలీ విత్తనాలు, పురుగు మందుల అమ్మకాలు జోలికి పోవద్దని, అవసరమైతే పిడి యాక్ట్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎవరు ఏం చేస్తున్నారన్నది అంతా చూస్తున్నామని, జాగ్రత్తగా ఉండాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, పొలీసులు పాల్గొన్నారు.