ఆసిఫాబాద్, వెలుగు : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం శనివారం వాంకిడి మండలం బెండార గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
ఈ స్కూల్నిర్మాణానికి సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరం ఉంటుందని, అధికారులు వెంటనే స్థలానికి హద్దులు నిర్ధారించి చదును చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆసిఫాబాద్, వాంకిడి మండలాల తహసీల్దార్లు రియాజ్ అలీ, కవిత, సర్వేయర్లు తదితరులు ఉన్నారు.
