ఆ ఊరిలో ఆట ఆచారం.. నెల రోజులు పండుగలా చేస్తరు

ఆ ఊరిలో ఆట ఆచారం.. నెల రోజులు పండుగలా చేస్తరు

పోలాల మాసంలో ఏ ఆదివాసుల గూడేనికి వెళ్లినా మరగోళ్ళు  ఎదురొస్తాయి​.  గూడేల్లోని పిల్లలంతా  వెదురు కర్రలతో చేసిన  గుర్రాలెక్కి  కేరింతలు కొడుతుంటారు.  అయితే ఇది పిల్లలకి ఆటే కావచ్చు. కానీ పెద్ద వాళ్లకు మాత్రం ఓ పెద్ద పండుగ. తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం ఇది. ఈ పండుగ ఆరోగ్య జాగ్రత్తల్ని కూడా చెప్తుంది అంటున్నారు ఆదివాసులు.

ప్రతి ఏటా చుక్కల అమావాస్య నుంచి పోలాల అమావాస్య వరకు నెలరోజుల పాటు మరుగోళ్ళ ఆట ఆడతారు. ఈ గుర్రాల ఆటను వాళ్లు "కోడంగ్" అని పిలుస్తారు. అసలు ఈ ఆచారం ఎలా వచ్చిందంటే.. కొన్నేళ్ల కిందట ఆదివాసుల గ్రామాలకి సరిగా రోడ్లు ఉండేవి కావు. దాంతో వర్షాకాలంలో  ఊరంతా బురదతో నిండిపోయేది. ఆ బురదలో నడవడం వల్ల ఏవేవో రోగాలు వచ్చేవి. వాటి బారి నుంచి తమ పిల్లల్ని కాపాడుకోవడానికి వచ్చిన ఆలోచనే  బొంగు కర్రల గుర్రాల ఆట. అప్పట్నించీ ప్రతి ఏటా వర్షాలు ఎక్కువగా పడే పోలాల మాసంలో పిల్లలతో ఈ ఆట ఆడించడం ఆచారంగా వస్తోంది. నెల రోజుల పాటు కాళ్ళకు చిత్తడి అంటకుండా   గుర్రాలపైనే నడుస్తారు పిల్లలు.  అయితే మరుగోళ్ళ ఆటను కేవలం మగ పిల్లలు మాత్రమే ఆడతారు. ఈ ఆచారం తమని చెడు దృష్టి నుంచి కూడా కాపాడుతుంది అని నమ్ముతారు వాళ్లు. 

చెడు గాలి అంటదు

వెదురు బొంగుల కర్రలతో మరగోళ్ళు తయారుచేస్తారు ఆదివాసులు. ఆ కర్రల కోసం ఊరంతా కలిసి కట్టుగా అడవి, పొలం గట్లకి వెళ్తారు. అందరూ కలిసే మరగోళ్ళు తయారుచేస్తారు. మరుగోళ్ళ పై నడవడానికి వెదురు బొంగు చెక్కలను కర్రకు తాడుతో కడతారు. వాటిపై పిల్లల్ని నడిపించి నెలరోజుల పాటు ఈ పండుగ జరుపుకుంటారు. ‘బడగా’ అనే మరో పండుగ కూడా చేసుకుంటారు. పోలాల పండుగ మరుసటి రోజు ఉదయాన్నే వెదురు బొంగు గుర్రంతో ఇంటిని, ఇంట్లో ఉన్న వస్తువులని , వాకిలి , పందిరిని కొడతారు. అలా చేయడం వల్ల రోగాలు, చెడు దృష్టి ఇంటినుంచి పారిపోతాయని వాళ్ల నమ్మకం.  ఆ తర్వాత ఆ బొంగు కర్రలను, సద్ది అన్నాన్ని తీసుకుని ‘జాగేయి బత్తరి’ అనుకుంటూ ఊరి పొలిమేరలో ఉన్న శివచెట్టు దగ్గరికి వెళ్తారు ఆదివాసులు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి మరగోళ్ళను వదిలేస్తారు. అంతేకాదు ‘బడగా’ రోజే అందరూ నైవేద్యం వండి గ్రామ దేవతకు పెడతారు. బడగా రోజు ఊళ్లోని పోచమ్మ తల్లిని దర్శించుకుని మేకలు, కోళ్లని బలి ఇస్తారు. తిరిగి ఇంటికొచ్చేటప్పుడు అడవుల్లో, పొలాల్లో దొరికే కొన్ని  మూలికల్ని ఇంటికి తెచ్చుకుంటారు. వాటి పసరు తాగితే అంటు రోగాలు దరిచేరవని నమ్ముతారు. అలాగే అడవి నుంచి చెట్ల కొమ్మల్ని తీసుకొచ్చి గుమ్మం, ఇంటి లోపల కడతారు. దానివల్ల ఇంట్లోకి దోమలు రావని నమ్ముతారు. 

మంచి జరుగుతదని..

చుక్కల అమావాస్య నుంచి పోలాల అమావాస్య వరకు ప్రతి ఆదివాసులు గూడెంలో ఈ ఆట ఆడతారు. దీనివల్ల ఊరికి, ఊరిజనానికి కూడా మంచి జరుగుతుందని పెద్దలు చెప్పేవాళ్లు. గూడెంలోని మగ పిల్లలంతా ఈ ఆట  ఆడతారు. అయితే మరగోళ్ళ ఆట నెలరోజులకి మించి ఆడితే ఊరికి అరిష్టం.

- ఆడా లింబరావు

ఊరికి శుభం పిల్లలకి ఆరోగ్యం

మరగోళ్ళ ఆట  ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. దీనివల్ల ఊరికి శుభం జరుగుతుంది.  పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఊరంతా జరుపుకునే ఈ పండుగ వల్ల ఆదివాసుల మధ్య బంధం కూడా  బలపడుతుంది.  అందుకే ప్రతి ఏటా పండుగ ఘనంగా జరుపుకుంటాం.


- కోవా రావుజీ 

::: ఆసిఫాబాద్, వెలుగు