బంగారు తెలంగాణ మోడల్​ ఇదేనా? : ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్

బంగారు తెలంగాణ మోడల్​ ఇదేనా?  :  ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్
  • ప్రజల్ని బానిసలుగా చూస్తున్న సర్కార్ కు బుద్ధి చెప్పాలి
  • ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేయాలి

కాగజ్​నగర్, వెలుగు: వానాకాలంలో ప్రజలు ప్రాణాలకు తెగించి వాగులు దాటడం బంగారు తెలంగాణకు మోడల్​గా చెప్పాలా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. ప్రజల బాధలు పట్టించుకోకుండా, వారిని బానిసలుగా చూస్తున్న సర్కారుకు బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు. కాగజ్​నగర్​ నియోజకవర్గ పర్యటనలో భాగంగా చింతల మానేపల్లి మండలంలోని దిందా గ్రామం దగ్గర రాకపోకలకు ఇబ్బందిగా మారిన లో లెవెల్ వంతెనను శనివారం ఆయన పరిశీలించారు. వానాకాలంలో రోజుల తరబడి స్కూళ్లకు స్టూడెంట్లు, టీచర్లు వెళ్లలేక.. ప్రజలు రాకపోకలు సాగించలేక అగచాట్లు పడుతున్నా పాలకులు మాత్రం కన్నెత్తి చూడలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలు తీర్చలేని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం నాగెపల్లిలో గుండెపోటుతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మల్లయ్య అంతిమయాత్రలో ఆర్​ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​పాల్గొని పాడె మోశారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్​లో ఆయన పోస్ట్ చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిత్యం దుర్గందం వెదజల్లే మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ, తీవ్ర అనారోగ్యానికి గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు నియంత పాలకులకు పట్టవని మండిపడ్డారు.జల దిగ్బంధంలో దిందా గ్రామంచింతల మానే పల్లి మండలం దిందా గ్రామం జలదిగ్బధమైంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎగువ నుంచి వస్తున్న వరదతో ఊరికి ముందున్న లో లెవెల్ వంతెనపై వరద నీరు ఎక్కువగా రావడంతో రాకపోకలు సాగించే పరిస్థితి లేకుండా పోయింది. స్కూళ్లకు వెళ్ళే స్టూడెంట్లు, రైతులు, గ్రామస్తులు వాగు దాటి పోలేక ఇబ్బంది పడ్డారు. గ్రామానికి రెండు వైపులా వాగు, మరో రెండు వైపులా ప్రాణహిత నది ఉండడంతో వందలాది మంది ప్రజలు అవస్థ పడుతున్నారు. వాగు దాటే అవకాశం లేకపోవడంతో స్కూల్ టీచర్లు వెనుదిరిగారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.