బీజేపీ, కాంగ్రెస్​లో టికెట్ల పంచాది

బీజేపీ, కాంగ్రెస్​లో  టికెట్ల పంచాది
  • ఆశావహుల్లో టెన్షన్
  • ముథోల్, ఖానాపూర్​లో పోటాపోటీ..
  • ఖానాపూర్ కాంగ్రెస్ నుంచి ఏకంగా 15 మంది

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా ముథోల్, ఖానాపూర్ సెగ్మెంట్లలో టికెట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం రేపో, మారో అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ దారులు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్​ టికెట్​ కోసం ఖానాపూర్​ నుంచి ఏకంగా 15 మంది పోటీలో నిలవడంతో టికెట్​ఎవరిని వరిస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు అభ్యర్థిత్వాల విషయమై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఈ రెండు పార్టీల కార్యకర్తలు తీవ్ర టెన్షట్​కు గురవుతున్నారు. 

శ్రీహరిరావు, మహేశ్వర్​ రెడ్డి ఫైనల్!

ఇప్పటికే అధికార బీఆర్ఎస్ టికెట్లు కేటాయించగా.. నేతలు నియోజవకర్గాల వారీగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థిత్వాలను ఖరారు చేయకపోవడంపై ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే, మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. ఒక్క నిర్మల్ నియోజకవర్గం మినహా ముథోల్, ఖానాపూర్​లో మాత్రం ఈ రెండు పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహులు పార్టీ టికెట్ల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

ముథోల్ సెగ్మెంట్​లో ఆసక్తికరం...

ముథోల్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం డాక్టర్ కిరణ్ కుమార్, మాజీ జడ్పీటీసీ విజయ్ కుమార్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు ఆనందరావు పటేల్ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా డాక్టర్ కిరణ్ కుమార్ పేరు ఫైనల్ కావచ్చన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలో మాత్రం ముగ్గురు సీనియర్ నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావు పటేల్, మోహన్ పటేల్ టికెట్ విషయంలో తగ్గేదేలే అంటూ ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు సీనియర్ నేతల విషయంలో ఎవరికి టికెట్ కేటాయించాలనే విషయంపై అధిష్టానం తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇక్కడ ఈ ముగ్గురు నేతల్లో ఎవరికి టికెట్ దక్కినా మిగతా ఇద్దరూ తిరుగుబాటు చేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ALSO READ : మా వాటా మాకియ్యాల్సిందే..బీసీ నేతల అల్టిమేటం

15 మందిలో ఎవరికో..

ఖానాపూర్ సెగ్మెంట్​లో బీజేపీ తరఫున మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, జడ్పీటీసీ జాను బాయి  టికెట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ రాథోడ్ రమేశ్ వైపే అధిష్టానం మొగ్గచూపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాజీ ఎంపీగా‌‌‌, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్​గా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పార్టీ అధిష్టానంతో కూడా ఆయనకు దగ్గర సంబంధాలు ఉండడంతో టికెట్ ఆయనకే దక్కవచ్చని అంటున్నారు. ఇక్కడి కాంగ్రెస్ ​టికెట్ ​కోసం ఏకంగా 15 మందికి పైగా ఆశావహులు దరఖాస్తు చేసుకొని, ఎవరికి వారే టికెట్​కోసం ముమ్మర 
ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన పీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆదివాసి తెగకు చెందిన తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు భరత్ చౌహాన్, చారులతా రాథోడ్, భూక్య చంద్రశేఖర్, లావుడియా బక్షినాయక్, జాదవ్ రామకృష్ణ నాయక్, సునీల్ జాదవ్, గుగులోత్ కిషోర్ కుమార్, జాదవ్ శ్రావణ్ కుమార్, కొట్నాక్ రమేశ్, రాములు నాయక్, పుర్క బాపూరావు, పెందూరు ప్రభాకర్, బదావత్ వినోద్ కుమార్ నాయక్ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి నియోజకవర్గంలో టికెట్ కేటాయింపు వ్యవహారం తలకు మించిన భారంగా మారింది.