అస్సాంలో ఆయుధాల శిక్షణా శిబిరం... తుపాకుల కలకలం.. కేసు నమోదు

అస్సాంలో ఆయుధాల శిక్షణా శిబిరం...  తుపాకుల కలకలం.. కేసు నమోదు

అస్సాం రాష్ట్రంలోని దర్రాంగ్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఆయుధ శిక్షణా శిబిరం నిర్వహించినందుకు గాను  నిర్వాహకులపై  అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళ్‌దై పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 153ఏ/34 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మంగళ్‌దాయిలోని మహర్షి బిద్య మందిర్‌లో  ఆయుధ శిక్షణా శిబిరంలో తుపాకుల శబ్దాలు వినిపించాయి.  స్థానికంగా ఈ వార్త వైరల్ కావడంతో  వారి చర్యలు సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలున్నాయని   పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆయుధ శిక్షణా శిబిరాన్ని నిర్వహించడంలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జిపి సింగ్.. దర్రాంగ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఈ విషయమై డీజీపీ స్వయంగా ట్విటర్ ద్వారా స్పందిస్తూ ... సమగ్రంగా దర్యాప్తు చేసి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని దర్రాంగ్ ఎస్పీకి ఆదేశించాము” అని ట్వీట్ చేశారు.

జిల్లాలోని మోర్నోయి గ్రామంలో నిర్వహించిన శిబిరంలో 350 మంది యువకులు యుద్ధ కళలు, రాజకీయాలు, ఆధ్యాత్మికతపై పాఠాలు నేర్చుకోవడంతో పాటు ఆయుధ శిక్షణ పొందార సమాచారం అందుతోందని పోలీసులు తెలిపారు. పొరుగు దేశాల నుంచి అక్రమ వలసదారుల భద్రతా బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇటువంటి శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారని పోలీసులు  పేర్కొన్నారు. ఆయుధ శిక్షణ క్యాంపు నిర్వహించడానికి  అనుమతి ఇవ్వడంలో జిల్లా యంత్రాంగం పాత్రపై విచారణ చేయాలని అస్సాం కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత దేబబ్రత సైకియా  డిమాండ్ చేశారు.