కాంగ్రెస్‌ ఎంపీపై అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!

కాంగ్రెస్‌ ఎంపీపై అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!

కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్‌ శర్మ స్థానిక కోర్టులో రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా తన కంపెనీకి రూ.10 కోట్ల సబ్సిడీ అందిందంటూ గొగొయ్‌ తప్పుడు ఆరోపణలు చేశారని రిణికి భూయాన్‌ శర్మ అన్నారు. కామ్‌రూప్‌ మెట్రోపాలిటన్‌లోని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో కేసు దాఖలు చేశామని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు.

ట్విటర్‌ వేదికగా తప్పుడు ఆరోపణలు చేసిన గౌరవ్ గొగొయ్‌పై తన క్లయింట్‌ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారని రిణికి భూయాన్‌ శర్మ న్యాయవాది తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీ కోసం తాము ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. సోషల్ మీడియా ద్వారా గొగొయ్‌ చేసిన ఆరోపణలు వాస్తవాలపై ఆధారపడి లేవన్నారు. తాము దీనిపై పోరాడతామని రిణికి శర్మ తరఫు న్యాయవాది తెలిపారు.

హిమంత సతీమణి కంపెనీ ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఇటీవల ఓ వెబ్‌సైట్‌ కథనం వెలువరించింది. ఇదే అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌ గౌరవ్‌ గొగొయ్‌  ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ ఆరోపణలు అస్సాం అసెంబ్లీని కూడా కుదిపేశాయి. ప్రతిపక్షాలు తమ ఆరోపణలకు ఆధారాలను చూపితే ఏ శిక్షకైనా సిద్ధమేనని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల ప్రకటించారు. అవసరమైతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ట్విటర్‌లో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గొగొయ్‌పై రూ.10 కోట్లకు దావా వేసినట్ల రిణికి భూయాన్‌ శర్మ చెప్పారు.