రోడ్డు ప్రమాదంలో అస్సాం ‘లేడీ సింగం’ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో అస్సాం ‘లేడీ సింగం’ దుర్మరణం

అస్సాం పోలీస్‌ విభాగంలో ‘లేడీ సింగం’గా పేరొందిన మహిళా పోలీస్‌ అధికారి జున్‌మోనీ రాభా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నాగాన్‌ జిల్లాలో పలు వివాదాల్లో చిక్కుకున్న మహిళా ఎస్సై జున్‌మోనీ రాభాను రోడ్డు ప్రమాదం కబళించింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

ప్రైవేటు కారులో ప్రయాణిస్తుండగా.. అర్థరాత్రి 2.30గంటల ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వస్తున్న ఓ కంటైనర్‌ వాహనాన్ని జున్‌మోనీ రాభా కారు ఢీకొట్టింది. జాఖలాబంధా స్టేషన్‌ పరిధిలోని సరుభుగియా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అందులో ఉన్న జున్‌మోనీని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

అయితే.. సివిల్‌ దుస్తుల్లో ఉన్న ఆమె.. ఆ సమయంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారన్న విషయం తెలియరాలేదని జిల్లా ఎస్పీ వెల్లడించారు. మోరికొలాంగ్‌ పోలీస్‌ ఔట్‌పోస్టు ఇన్ ఛార్జిగా ఎస్‌ఐ జున్‌మోనీ రాభా ఉన్నారు. 

అస్సాం పోలీసు విభాగానికి చెందిన జున్‌మోనీ రాభా.. నాగాన్‌ జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించేవారు. విధుల్లో కఠినంగా వ్యవహరించే ఆమె.. తనదైన పనితీరుతో ఆ ప్రాంతంలో ‘లేడీ సింగం’, ‘దబాంగ్‌ పోలీస్‌’గా పేరు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో ఆమె పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు.

అవినీతి ఆరోపణలపై గతేడాది జూన్‌లో అరెస్టైన ఆమె.. కొంతకాలం సస్పెన్షన్‌లో ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో తిరిగి ఆమె విధుల్లో చేరారు. ఓ బీజేపీ ఎమ్మెల్యేతో జరిపిన ఫోన్‌ సంభాషణ కూడా అప్పట్లో వివాదాస్పదమైంది.