విహార యాత్రలో విషాదం.. 45మందితో వెళ్తున్న బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీ

విహార యాత్రలో విషాదం.. 45మందితో వెళ్తున్న బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీ

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గుతో వెళ్తున్న ఓ ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో దాదాపు 12 మంది మరణించారు, మరో 25 మంది గాయపడ్డారు. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజన్ ప్రాంతంలో ఉదయం 5:00 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని గోలాఘాట్ ఎస్పీ రాజేన్ సింగ్ తెలిపారు.

బలిజన్ వద్ద 45 మందితో వెళ్తున్న ఓ బస్సు.. గూడ్స్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని గోలాఘాట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేన్ సింగ్ మీడియాకు తెలిపారు. బస్సు అస్సాం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 4:30 నుండి 5:00 గంటల మధ్య గోలాఘాట్‌లోని కమర్‌గావ్ నుంచి విహారయాత్ర కోసం తిన్‌సుకియా జిల్లాలోని తిలింగ మందిర్‌కు వెళుతున్న బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని ఆయన తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామని సింగ్ చెప్పారు. గాయపడిన 30 మంది ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారని జోర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సీనియర్ డాక్టర్స్ తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని పర్యవేక్షిస్తున్నామన్నారు.