
- మత్తు మాత్రలు ఇవ్వడంతో వృద్ధుడి మృతి, చావుబతుకుల్లో వృద్థురాలు
- బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్‌తో చేసిన అప్పులు తీర్చేందుకు ఘాతుకం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తిలో ఇటీవల జరిగిన వృద్ధదంపతులపై హత్యాయత్నం, హత్య కేసులో అదే గ్రామానికి చెందిన కత్తి శివ అనే యువకుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ తో చేసిన అప్పులు తీర్చేందుకే ప్లాన్ ప్రకారం వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడును నిందితుడు అపహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కథనం ప్రకారం.. గర్షకుర్తి గ్రామానికి చెందిన గజ్జల శంకరయ్య(76), లక్ష్మి(70) దంపతులు ఒంటరిగా ఉంటున్నారు. వారి ఇంటికి సమీపంలో ఉండే కత్తి శివ వారికి బయట నుంచి మందులు, అవసరమైన సామగ్రి తెచ్చి ఇచ్చి సహాయపడేవాడు. శివ ఇటీవల ఆన్ లైన్ లో బెట్టింగ్ లు, పేకాటతో పాటు జల్సాలకు బానిసై అప్పులపాలయ్యాడు.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు వృద్ధ దంపతులను చంపి లక్ష్మి మెడలోని బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే వారికి ఈ నెల 7న జ్వరం, జలుబు, దగ్గు, ఒల్లు నొప్పులు ఉన్నాయని తెలుసుకుని.. తన దగ్గర ఉన్న ట్యాబ్లెట్లు వాడితే వెంటనే తగ్గిపోతాయంటూ కల్లులో మత్తు కోసం కలిపే ట్యాబ్లెట్లను ఇచ్చాడు. ఒక్కొక్కరు ఆరు మాత్రలు చొప్పున మింగేలా చేశాడు. 2 గంటల తర్వాత ఇద్దరు వృద్ధులు మత్తులోకి జారుకోగా, లక్ష్మి మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును తీసుకుని పరారయ్యాడు.
అపస్మారక స్థితిలో ఉన్న వృద్దులు శంకరయ్య, లక్ష్మిని అదే రోజు సాయంత్రం ఆసుపత్రికి తరలించగా, మరుసటి రోజు మధ్యాహ్నం శంకరయ్య చనిపోయాడు. అతడి భార్య లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. పుస్తెలతాడు తీసుకున్న రోజే గ్రామంలోని కట్ల శ్రీనివాసాచారి అనే గోల్డ్ స్మిత్ వద్ద శివ ఆ బంగారం అమ్మి రూ.1.85 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులతో అప్పు తీర్చుకోవడంతో పాటు పేకాట, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ లలో పెట్టి ఖర్చు చేశాడు.
ఈక్రమంలో శివ తన దగ్గర మిగిలిన మాత్రలను పడేసేందుకు సోమవారం వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద రూ.25 వేల నగదు, 11 మత్తు మాత్రలు, ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా గోల్డ్ స్మిత్ శ్రీనివాసచారి వద్ద బంగారు పుస్తెల తాడు స్వాధీనం చేసుకున్నారు.
మిస్టరీని ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన రూరల్ ఏసీపీ విజయ కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చారి, కానిస్టేబుళ్లు జంపన్న, అరవింద్ ను సీపీ అభినందించారు.