మళ్లీ మోసం చేసేందుకు బడ్జెట్ సమావేశాలు : బండి సంజయ్

మళ్లీ మోసం చేసేందుకు బడ్జెట్ సమావేశాలు : బండి సంజయ్

ఆచరణ కాని హామీలు ఇచ్చేందుకు, రాష్ర్ట ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలు, హామీల గురించి చర్చ జరగదని అన్నారు. కొత్త కొత్త సంక్షేమ పథకాల పేర్లు చెప్పి.. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలందరికీ వివరించాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ర్టంలో జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు స్వేచ్ఛగా పని చేసే పరిస్థితి కూడా లేదని చివరకు కోర్టు ఆదేశాలను కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. 

వాళ్లు చెల్లని రూపాయలు

ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభపైనా బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి జాతీయత లేదని... జాతీయ ప్రణాళిక అసలే లేదని ఆరోపించారు. బహిరంగ సభకు వచ్చిన వారు చెల్లని రూపాయలుగా మిగిలిన వాళ్లే అంటూ వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన నాయకులు వివిధ స్కామ్ లలో ఉన్నావారే అని ఆరోపించారు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నాయకులతో ఖమ్మంలో సభ పెట్టారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీని తిట్టేందుకే బహిరంగ సభ నిర్వహించారని రాష్ర్ట ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.