హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి సీతక్క మధ్య గురువారం అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగింది. తనకు కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వడంతోపాటు ఐదు సీబీఐ కేసులు కూడా పెట్టిందని సబితా ఇంద్రారెడ్డి గుర్తుచేశారు. ఆవేదనతో మాట్లాడుతున్నానని తనవైపు నిజాయితీ ఉంది కాబట్టే కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నానని తెలిపారు. ‘‘తనను, కేసీఆర్ కుటుంబాన్ని తిడితే ముఖ్యమంత్రి సంతోషిస్తారని కొందరు భావిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ లో పుట్టి పెరిగినట్టు మాట్లాడితే ఎలా’’ అంటూ ప్రశ్నించారు. తాను అయ్యో అన్నందుకు దొరసాని అంటూ విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ లో గెలిచి మంత్రి అయ్యారుగా: సీతక్క
కాంగ్రెస్ లో గెలిచిన సబితారెడ్డి బీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారని మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగినోళ్లు (సబితారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి) ఎం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీబీఐ కేసు పెట్టిందనే బాధ ఉంటే.. అప్పుడే రాజీనామా చేయాల్సిందని గుర్తుచేశారు. కానీ, సీబీఐ కేసు అయ్యాక కూడా కాంగ్రెస్ లోనే ఎమ్మెల్యే అయ్యారని తెలిపారు. తను (సబితారెడ్డి) కాంగ్రెస్ వీడే టైమ్ లో తామంతా బతిమాలామని పేర్కొన్నారు.
వాళ్లతో తనకు పోలిక లేదని.. వారిపై ఎలాంటి ద్వేషం లేదన్నారు. ‘‘వాళ్లది హైదరాబాద్ సిటీ.. మాది అడవి ప్రాంతం. వాళ్లు ఉన్నత వర్గాలు.. తాను అడవీ బిడ్డను.. వాళ్లకు తనకు కంపారిజన్ లేదు”అని స్పష్టం చేశారు.
