
- ప్రచార సామగ్రికి అభ్యర్థులు ఆర్డర్లు
- టీ షర్ట్లు, టోపీలకు మస్తు డిమాండ్
- బిజీగా ప్రింటింగ్ షాప్‌ల ఓనర్లు
హైదరాబాద్, వెలుగు: దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో ప్రచార సామగ్రికి డిమాండ్పెరిగింది. ప్రింటెడ్ టీ షర్ట్లు, కండువాలకు అభ్యర్థులు భారీగానే ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రింటెడ్ టోపీలు, బ్యాడ్జీలకు కూడా మస్తు గిరాకీ వస్తుంది. ఒక్కో సెగ్మెంట్ నుంచి 2 వేల నుంచి 10 వేల దాకా ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో సిటీలోని చిక్కడపల్లిలో ప్రింటింగ్ షాపులు ఎన్నికల పనులతో బిజీగా మారాయి. ప్రతి ఎన్నికల సీజన్లో ఒక్కో ప్రింటింగ్షాప్ యావరేజ్‌గా 20 వేల టీ షర్టుల బల్క్ ఆర్డర్లు ఉంటాయని ప్రింటింగ్ షాప్‌ల ఓనర్లు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు జెండాలు, కండువాలు సిరిసిల్ల నుంచి తెప్పించుకుంటాయి. దేశంలోని ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎక్కువశాతం జెండాలు మాత్రం సిరిసిల్ల నుంచే వెళ్తుంటాయి.
ఖర్చుకు వెనకాడకుండా..
ప్రింటింగ్ షాప్‌లకు కావాల్సిన ముడి వస్తువులను తిరుపతి, చెన్నై, సూరత్తదితర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటారు. సాధారణంగా ఒక్కో రౌండ్‌నెక్ ప్రింటెడ్ పాలిస్టర్ టీ షర్ట్‌కు రూ. 90 దాకా ఉంటుంది. బల్క్ ఆర్డర్లకు ఒక్కో టీషర్టు రూ. 75 తీసుకుంటారు. ఈ లెక్కన ఒక్కో అభ్యర్థి సగటున 5 వేల టీ షర్ట్లు ఆర్డర్ ఇచ్చారనుకుంటే, దాదాపు రూ. 4 లక్షల దాకా వీటిపై ఖర్చు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా పదివేల దాకా టీషర్టులను ప్రింట్ చేయించుకుంటున్నట్లు సమాచారం.ప్రింటెడ్ కాటన్, కాలర్ టీ షర్ట్‌లకు రూ. 170 దాకా ఉంటుంది. దీంతో అభ్యర్థులు రౌండ్ నెక్ పాలిస్టర్ టీషర్టులకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టీషర్టులే కాకుండా.. ప్రింటెడ్ కండువాలు, టోపీలు, బ్యాడ్జీలు, గొడుగులు, కీ చెయిన్స్, పెన్స్ ఇతర ప్రచార వస్తువులకు కూడా కొందరు అభ్యర్థులు ఆర్డర్లు ఇస్తున్నారు.
రెండు, మూడు నెలల ముందే..
ప్రస్తుతం ఎన్నికల రూల్స్, ఖర్చు, లెక్కలు తదితర సమస్యలు ఉంటాయి. దీంతో అభ్యర్థిత్వం ఖరారైన, సీటు కన్ఫార్మ్ అనుకున్న కొందరు అభ్యర్థులు రెండు, మూడు నెలల ముందుగానే టీ షర్టులకు బల్క్‌ఆర్డర్లు ఇచ్చినట్లు ప్రింటింగ్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బల్క్ ఆర్డర్లు తగ్గాయని, నామినేషన్ ప్రక్రియ మొదలైతే పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
నామినేషన్ల తర్వాతే..
ప్రస్తుతం బల్క్ ఆర్డర్లు తక్కువగానే ఉన్నాయి. నామినేషన్స్ ప్రక్రియ మొదలైతే పెరుగుతాయి.సిటీలో కంటే రూరల్ఏరియాల నుంచే ఎక్కువ బల్క్ ఆర్డర్లు వస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు వేలల్లో ఆర్డర్లు ఇస్తారు. చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు రెండువేల పీసుల లోపే ఆర్డర్లు ఇస్తున్నారు.
- నందు, నందు ప్రింటర్స్, చిక్కడపల్లి