హైదరాబాద్, వెలుగు: రాజస్తాన్, హైదరాబాద్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ గ్రూప్-డి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన హైదరాబాద్ విజయంపై ఆశలు రేపుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 221/5తో మూడో రోజు, సోమవారం ఆట కొనసాగించిన రాజస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 269 రన్స్‌కే ఆలౌట్ చేసింది. తనయ్ త్యాగరాజన్, సీవీ మిలింద్ చెరో మూడు, పున్నయ్య, అనికేత్ రెడ్డి రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం 95 రన్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన హైదరాబాద్ మూడో రోజు చివరకు రెండో ఇన్నింగ్స్‌లో 198/7 స్కోరుతో నిలిచింది. ఓవరాల్‌గా 293 ఆధిక్యంలో ఉంది. ఓపెనర్లు తన్మయ్ (12), అభిరథ్ రెడ్డి (14), ఫెయిలైనా.. కెప్టెన్ రాహుల్ సింగ్ (59), కె. హిమతేజ (41), రాణించారు. వరుణ్ గౌడ్ (29) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రోహిత్ రాయుడు (19 బ్యాటింగ్), తనయ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మంగళవారమే ఆటకు చివరి రోజు.
