అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ ​సీనియర్లకు అగ్ని పరీక్షే

అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ ​సీనియర్లకు అగ్ని పరీక్షే
పార్లమెంట్‌కు రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించడం, సీనియర్లకు దీటుగా జూనియర్లు టికెట్‌ రేసులో ఉండడం, కొన్నిచోట్ల వారసులు బరిలో దిగే అవకాశం ఉండడంతో సీనియర్లు టార్గెట్‌ రీచ్‌ అవుతారా.. లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది. 

రిటైర్మెంట్ ప్రకటించిన జానా

2018 ఎన్నికల వరకు క్రియాశీలక రాజకీయాల్లో సత్తా చాటిన మాజీ సీఎల్పీ లీడర్‌ జానారెడ్డి కొడుకుల కోసం పొలిటికల్​ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఇద్దరు కొడుకుల్లో ఎవరికి టికెట్‌ ఇచ్చినా ముందుగా నాగార్జునసాగర్‌‌ కన్ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే  రెండో టికెట్ ​గురించి ఆలోచించే పరిస్థితి నెలకొంది.  2018 ఎన్నికలు, సాగర్​ బైపోల్‌లో​ రెండు సార్లు ఓడిపోయిన జానారెడ్డి ఈ సారి కొడుకులకు గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

అయితే టికెట్‌ ఇద్దరికి ఇస్తారా..? ఒక్కరికా.. ? అనేది తేలాల్సి ఉంది. ఉదయ్‌పూర్‌‌ డిక్లరేషన్ నేపథ్యంలో మిర్యాలగూడ బీసీకి  ఇచ్చే అవకాశం ఉండడంతో సాగర్ మాత్రమే దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. కాగా,  సాగర్‌‌ నుంచి జానారెడ్డే పోటీ చేయాలని కేడర్​శతవిధాల ప్రయత్నిస్తోంది. 

రెండు నియోజకవర్గాలపై ఉత్తమ్ ఫోకస్‌

టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్​కుమార్​ రెడ్డి తన నియోజకవర్గం హుజూర్​నగర్‌‌తో పాటు తన సతీమణి పద్మావతి నియోజకవర్గమైన కోదాడ పైనా ఫోకస్​ పెట్టారు. 2018లో పద్మా వతి ఓడిపోవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను గెలిపించేందుకు పోరాడుతున్నారు. పార్టీ మెంబర్​ షిష్​లో కోదాడ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మేజర్​గ్రామాలు, మండలాల్లో ఆధిపత్యం చలాయించిన ఒకప్పటి కాంగ్రెస్ కేడర్​చల్లాచెదురైంది.  

ఇక్కడ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉత్తమ్​పాత కేడర్‌‌ను తిరిగి దారిలోకి తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇక్కడ సిట్టింగ్​ఎమ్మెల్యే బొల్లం మ ల్లయ్య యాదవ్‌పై పెరిగిన అసమ్మతి  కలిసొస్తదని ఆయన భావిస్తున్నారు.  ఇక హుజూర్​నగర్​ బైపోల్‌లో కాంగ్రెస్ సిట్టింగ్​స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఎంపీ ఉత్తమ్​ కుమార్​చేసిన ప్రయత్నాలు వర్కవుట్​కాలేదు. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరుతామని ఆయన చెబుతున్నారు. 

దామన్నకు పక్కలో బల్లెంలా రమేశ్ రెడ్డి

సూర్యాపేటలో రెండు సార్లు ఓటమిపాలైన దామోదర్ రెడ్డికి  మంత్రి జగదీశ్‌​ రెడ్డి ప్రత్యర్థే అయినా.. సొంత పార్టీలోని  పటేల్​రమేశ్‌​ రెడ్డి పక్కలో బల్లెంలా మారారు.  దామన్నకు పోటీగా టికెట్​ ఆశిస్తున్న ఆయన ఈ మేరకు సొంతంగా ప్రోగ్రాములు కూడా చేస్తున్నారు. లాస్ట్‌ టైం రమేశ్ రెడ్డి సహకరించకపోవడంతోనే ఓడిపోయానని దామన్న ఆరోపణలు చేయడమే కాదు.. హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్నా సీనియర్, జూనియర్‌‌ మధ్య సఖ్యత లేకపోవడంతో క్యాడర్‌‌ను కలవరపెడుతోంది. అయితే ఈ సారి లాస్ట్‌ చాన్స్‌ ఇవ్వాలని కోరుతున్న దామన్న..  2014, 20 18 ఎన్నికల్లో ఓడిపోవడంతో సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్నారు.  

ఒంటరిగానే కోమటిరెడ్డి ఫైట్

మాజీ ఎమ్మెల్యే కోటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారినా.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీలో ఆధిపత్యం కోసం యత్నిస్తున్నారు. నల్గొండ సీటు బీసీలకు ఇస్తానని ప్రకటించినా.. ఇటీవల తానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.  ఇందులోభాగంగానే ఇటీవల నియోజకవర్గ బూత్​ లీడర్లలో మీటింగ్​పెట్టారు. వాల్​ రైటింగ్స్​తోపాటు, సామాజిక మాద్యమాల్లో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.  సోనియా గాంధీ సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు.  

కాగా, వెంకటరెడ్డి నల్గొండ నుంచి వెళ్లిపోయాక ముఖ్యనేతలు, కేడర్​ బీఆర్ఎస్​లో చేరింది.  ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన వెంకట్‌ రెడ్డి చేజారిపోయిన పార్టీ నాయకులను తిరిగి తనవైపు తీసు కొచ్చేందుకు గట్టిగానే శ్రమించాల్సి వస్తోంది.  తన తమ్ముడు రాజగోపాల్​ రెడ్డి వెంట లేకపోవడం, నకిరేకల్​లో ఆయన అనుచరుడు చిరుమర్తి లింగయ్య పార్టీ మారడంతో  వెంకటరెడ్డి ఒంటిరిగానే ఫైట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.