అసెంబ్లీ మీటింగ్​ అంటే భయమెందుకు కేసీఆర్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

అసెంబ్లీ మీటింగ్​ అంటే భయమెందుకు కేసీఆర్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగ జ్ నగర్, వెలుగు:  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసినా  తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఎందుకు  నిర్వహించడం లేదో సీఎం కేసీఆర్ చెప్పాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించవలసి వస్తుందని, లిక్కర్ స్కాం గురించి సమాధానం చెప్పాల్సి వస్తుందన్న  భయంతోనే  సమావేశాలు పెట్టడంలేదని ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా  కాగజ్ నగర్ లో బుధవారం పాదయాత్ర చేశారు. మీడియాతో  మాట్లాడుతూ తెలంగాణలో  ఇంకెంత కాలం ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా కాలం గడుపుతారని నిలదీశారు.

మెట్రో రైలు సిబ్బంది రోజూ 8 గంటలు  పనిచేస్తే రూ. 10వేలు ఇవ్వడం దారుణమన్నారు. ఎల్అండ్ టీ  కంపెనీ లాభాల్లో కేటీఆర్ కు వాటా ఉండడం వల్లే ఈ దోపిడిని పట్టించుకోవడంలేదన్నారు. పోలీసు ఈవెంట్లలో లాంగ్ జంప్ రద్దు చేసి, రన్నింగ్, షాట్ పుట్ లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ రాసే అవకాశం ఇవ్వాలన్నారు. లోకల్​ఎమ్మెల్యే కోనప్ప ఇక్కడ కమిషన్లు వసూలు చేసి కేటీఆర్ కు పంపుతున్నారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీడం గణపతి,నియోజకవర్గ ఇన్​చార్జి అర్షద్ హుస్సేన్,  నియోజకవర్గ అధ్యక్షుడు దుర్గం ప్రవీణ్, నియోజకవర్గ నాయకులు రాం ప్రసాద్, నక్క మనోహర్  పాల్గొన్నారు.