అసెంబ్లీ సీట్లు పెరుగతయ్..

అసెంబ్లీ సీట్లు పెరుగతయ్..
  • రాష్ట్ర బీజేపీ శాఖ ఒత్తిడితో కేంద్రం సానుకూలం
  • నడ్డా హైదరాబాద్ టూర్లో దీనిపై మంతనాలు
  • కాశ్మీర్, సిక్కింతో పాటుగా చేయాలని హైకమాండ్కు రాష్ట్ర బీజేపీ సూచన
  • డీలిమిటేషన్ జరిగితే 34 సీట్లు పెరిగే చాన్స్
  • అందులో గ్రేటర్ పరిధిలోనే 20 సీట్లు
  • అర్బన్లో సీట్లు పెరిగితే కలిసొస్తుందని ధీమా
  • గతంలో పెండింగ్లో పెట్టిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్రంలో  అసెంబ్లీ సీట్లు పెంచే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ నేతల చేరికలతో ఉత్సాహంలో ఉన్న రాష్ట్ర బీజేపీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీన్ని పార్టీ హైకమాండ్ ముందు ఉంచినప్పుడు సానుకూలంగా స్పందన వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో పట్టుపెరుగుతోందని భావిస్తున్న పార్టీ నేతలు ఈ ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ తో అసెంబ్లీ సీట్లు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ వస్తాయి కాబట్టి తమకు బాగా కలిసొస్తుందని వారు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో ఈ అంశంపై అంత ఇంట్రెస్ట్​గా లేని రాష్ట్ర బీజేపీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది.

వెలుగు బ్యూరో : ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలోనే తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఎన్నికల కమిషన్ ద్వారా పెంచుకోవచ్చని ప్రస్తావించారు. మన రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కి, ఏపీలో 175 నుంచి 225కి పెంచాలని చట్టంలో ఉంది. దీని ప్రకారం రెండు రాష్ట్రాల్లో సీట్లను పెంచే ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోంశాఖ అప్పట్లోనే ఈసీకి లేఖ రాసింది. అయితే దీనిపై న్యాయసలహా తీసుకున్న ఈసీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా డీలిమిటేషన్ సాధ్యం కాదని హోంశాఖకు రిప్లై ఇచ్చింది. ఆర్టికల్ 170 ప్రకారం 2026 సంవత్సరం తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే పార్లమెంట్లు సీట్లుగానీ, అసెంబ్లీ సీట్లనుగానీ పెంచాల్సి ఉంది. పదేండ్లకు ఒకసారి చేసే జనాభా లెక్కల సేకరణను 2021 తర్వాత 2031లోనే చేపట్టాలి. అంటే 2031 జనాభా లెక్కలు వచ్చిన తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉంటుంది. విభజన చట్టం ప్రకారం ఇప్పుడే సెగ్మెంట్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రానికి ఈసీ చెప్పింది.

కేసీఆర్, బాబు ప్రయత్నాలు

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నుంచే ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు సెగ్మెంట్ల పెంపు కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. దీనిపై మోడీని కలిసి  పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వలస వస్తున్న లీడర్ల కోసం, ఏపీలో వైసీపీ నుంచి చేరిన నేతల కోసం సీట్లు పెరగాలని ఇద్దరు సీఎంలు పట్టుబట్టారు. అయితే సెగ్మెంట్లు పెరిగితే టీఆర్ఎస్ కే లాభమని రాష్ట్ర బీజేపీ నేతలు భావించారు. కమలం పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవద్దని పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కోరారు. ఇతర పార్టీల నుంచి వలసలను ఆకర్షించడానికే టీఆర్ఎస్ సీట్లు పెరగాలని కోరుతోందని చెప్పారు. అప్పట్లో 119 సీట్లలో పోటీచేయడానికే బీజేపీకి సరైన అభ్యర్థులు లేనప్పుడు 153 సీట్లు చేయడం వల్ల లాభం లేదని వివరించారు. దీంతో కేంద్రం ఈ ప్రతిపాదనను పక్కనబెట్టింది.

నాలుగు నెలల్లోనే మారిన సీన్

ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సీన్ మారడంతో బీజేపీలో కొత్త జోష్ వచ్చింది. మేలో వచ్చిన లోక్ సభ ఫలితాల్లో రాష్ట్రంలో బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 20 శాతం ఓట్లు రావడం ఉత్సాహాన్నిచ్చింది. దీంతో హైకమాండ్ కూడా రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్ షా తెలంగాణ నుంచే ప్రారంభించడంతో పాటు తాను కూడా హైదరాబాద్ లోనే క్రియాశీల సభ్యత్వం తీసుకుంటానని ప్రకటించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలనుకునే ఇతర పార్టీల నేతలు బీజేపీవైపు చూడడం మొదలైంది. దీంతో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పలు పార్టీల నేతలు బీజేపీలోకి క్యూ కట్టారు. అలా చేరుతున్న నియోజకవర్గ స్థాయి లీడర్లు ఎమ్మెల్యే టికెట్ కోసం హామీ అడుగుతున్నారు. వారికి హామీ ఇస్తే, ఇంత కాలం పార్టీని నమ్ముకున్నవాళ్లు నొచ్చుకునే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ నేతల దృష్టికి వచ్చింది. దీంతో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ నడ్డా ముందు ఈ ప్రతిపాదనను రాష్ట్ర నేతలు ఉంచారనీ, దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

కమలం అర్బన్ లెక్కలు

డీలిమిటేషన్ దిశగా అడుగులు పడితే తమకు అనుకూలంగా జరిపించుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో డీలిమిటేషన్ జరిగినప్పుడు పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి పూర్తి అనుకూలంగా విభజించారన్న విమర్శలొచ్చాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఒకచోట చేర్చడం వల్లే పాతబస్తీ ప్రాంతంలో ఎంఐఎంకు సీట్లు పెరిగాయన్న అభిప్రాయం ఉంది. 2009 నుంచి ఈ ప్రాంతంలో ఎంఐఎం 7 సీట్లను ఏకపక్షంగా గెలుస్తోంది. ఈసారి ఇలాంటి వాటిని సరిదిద్దితే మలక్ పేట, కార్వాన్ లాంటి సీట్లలో తమకు పట్టుపెరుగుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ మొదటి నుంచి బలంగా ఉందనీ, ఇప్పుడు లీడర్ల చేరికలతో మరింత బలపడుతుందని వారు ధీమాగా చెబుతున్నారు. రాష్ట్రంలో పెరిగే 34 సీట్లలో 20కి పైగా గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లోనే ఉండే అవకాశం ఉంది. 2023లో రాష్ట్రంలో అధికారం సాధించాలన్న లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుందని రాష్ట్ర బీజేపీ నేతల ఆలోచన.