
పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హైవే సర్వీస్ రోడ్డుపై శనివారం బైక్‌పై వెళ్తున్న తల్లి, కొడుకుపై దాడి చేసి, బంగారాన్ని దోచుకొని పరారయ్యారు. ఈ ఘటనలో తల్లీకొడుకుకు గాయాలవగా స్థానికులు వారిని మద్నూర్ హాస్పిటల్‌కు తరలించారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మల్లయ్యగారి ఎల్లాగౌడ్, అతని తల్లి సత్తెమ్మ బైక్‌పై మద్నూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తున్నారు. సర్వీస్ రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని బైక్ ను అటకాయించి కత్తులతో దాడి చేసి, ఏడు తులాల బంగారం ఆభరణాలు దోచుకున్నారని తెలిపారు. బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై విజయ్‌కొండ బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండుగులను గాలించేందుకు మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు టీమ్‌ను పంపినట్లు వారు తెలిపారు.