భరోసా ఇస్తున్నా… అన్ని నెరవేరుస్తా: YS జగన్

భరోసా ఇస్తున్నా… అన్ని నెరవేరుస్తా: YS జగన్

రాష్ట్ర మొత్తం పాద యాత్రతో  నలుమూలలా తిరిగానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ల కష్టాలేంటనేది చూశానని. మీ మాటలు విన్నాను. నేనున్నాను అన్న భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి మంచి జరిగే విధంగా మరో నాలుగైదు రోజుల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ (సోమవారం) కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. గ్రామాల్లో వుండే రైతులు పంట బాగా పండాలని, గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటాడు. కానీ టీడీపీ పాలనలో రైతు దగా పడ్డాడన్నారు. పాదయాత్ర లో రైతులు పడుతున్న ఇబ్బందులు ఎన్నో విషయాలు నా దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇక మహిళల సమస్యల గురించే చెప్పే పరిస్థితి లేదన్నారు. ఎక్కడా చూసినా అక్క చెల్లెమ్మలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. వీరందరికీ భరోసా ఇస్తున్నాను అంటూ జగన్ భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఫీజులు కట్టలేని దారుణమైన పరిస్థితుల్లో వున్నారని…విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టేందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారన్నారు. మీ కష్టాలను స్వయంగా చూసాను.. సమస్యలను విన్నాను.. నేను వున్నాను అని ధ్వర్యం చెప్పారు. అంతేకాదు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన పెద్దమనిషి నట్టేట ముంచాడని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్య సమస్య వస్తే 108, ఆరోగ్యశ్రీ ఉందని ధైర్యం ఉండేదని… ప్రస్తుతం ఆ పరిస్థితుల్లేవన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. అవ్వ తాతలకు ఫెన్షన్ ఇవ్వాలంటే ఏ పార్టీ వాడివని అడుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదన్నారు. చంద్రబాబు అన్యాయమైన, అవినీతి పాలనతో ప్రజలు విసుగుచెందారని.

స్వర్గీయ రాజశేఖర రెడ్డి సువర్ణ పాలన మళ్ళీ రావాలంటే జగన్ అన్న వస్తేనే సాధ్యం అవుతుందనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నారు. నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశం నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు.