శ్రీ క్రోధి నామ పంచాంగం : సింహ రాశి వారి జాతకం ఎలా ఉందంటే?

శ్రీ క్రోధి నామ పంచాంగం : సింహ రాశి వారి జాతకం ఎలా ఉందంటే?

ఆదాయం : 5

వ్యయం      : 5

రాజపూజ్యం : 5

అవమానం  : 2

ఉత్తర 2,3,4 పాదములు; హస్త 1,2,3,4 పాదములు; చిత్త 1, 2 పాదములు, మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో

గురువు 9.4.2024 నుండి 1.5.2024 వరకు మేషరాశియందు లోహమూర్తిగా సంచారం. శని 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు రజితమూర్తిగా సంచారం. రాహు కేతువులు 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు రజిత మూర్తులుగా సంచారం.

ఈ రాశి వాళ్లకు చాలా సామాన్యంగా ఉంటుంది. రైతులకు పంటలు చేతికి రావు. అనేక ఇబ్బందులు. వృత్తి ఉద్యోగ ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు అనేక విధములుగా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. లాయర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులకు ప్రతి విషయంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. పరిస్థితులు అర్థం కావు. మార్గం ఎంత ఆలోచన చేసినా అర్థం కాదు. అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఉంటుంది. బిగ్ ఇండస్ట్రీ వారు చాలా జాగ్రత్తలు తీసుకొనగలిగితే వ్యాపారంలో బ్యాలెన్స్ అవుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పరిస్థితులు ఎటు అనేది తెలియదు.

ఇప్పటి దాకా మీకు ఎదురు లేదు అనేవారు సైతం ఆర్థిక వనరులు అమీతుమీగా ఉంటాయి. బంగారం, వెండి, కాపర్​, టేకు వ్యాపారములు సరిగా జరగక.. రేట్లు పెరిగినా ఆదాయం కనిపించదు. అప్పులు చేయవలసి వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. ఈ సంవత్సరంలో సమస్యల వలయంలో ఉంటారు. మీరు భక్తి మార్గంలో భగవంతుడు ఉన్నాడని నమ్మి... గ్రహములకు, ఇష్ట దైవములకు ప్రేమగా పరిహార క్రియలు ఆచరించండి. వాస్తు శాస్త్ర దోషములకు రెమెడీ ఆలోచన చేసి సమస్యను ఎవరికి వారు పరిష్కరించుకొనుట వలన మానసిక ఒత్తిడి ఎంత ఉన్నా పరిస్థితులు అర్థం కాకపోయినా మీకు తెలియకుండా ఆ తల్లి దయ వలన కొంత ఉపశమనం ఉంటుంది. మఖ నక్షత్రం వాళ్లు జాతి వైఢూర్యం ధరించండి. చిత్రగుప్త దేవాలయంలో పూజలు

సరస్వతి, వినాయక పూజలు చేయడం వల్ల కొంత ఊరట. పుబ్బ నక్షత్రం వాళ్లు జాతి డైమండ్ ఉంగరం ధరించగలరు. శక్తిలేనివారు అమెరికన్ డైమండ్ ధరించండి. శుక్రవారం శ్రీ లక్ష్మీదేవికి పూజలు, లక్ష్మీదేవి కవచం, సహస్ర నామాలు, కనకధార స్తోత్ర పారాయణ చేయండి. ఉత్తర నక్షత్రం వాళ్లు జాతి కెంపు ధరించండి. ఆదివారం నియమములు పాటించి ఆదిత్య హృదయ పారాయణ, సూర్య దండకం చేయండి. నవగ్రహ ప్రదక్షిణలు జపదానములు వలన ఈతిబాధలు తొలగును. ఈ సంవత్సర గ్రహ ఆరాధన వలన మానసిక ఒత్తిడి తగ్గి సుఖజీవనము గడపగలరు. మీ విశ్వాసము మీ బలమని గుర్తించండి. అదృష్టసంఖ్య1.

చైత్రం : ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తెలియని కష్టనష్టములు పడవలసి ఉన్నది. చాలా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఉద్యోగులు కన్నెర్ర చేయగలరు. కోర్టు కేసులు రాగలవు. భగవంతుని ధ్యానం, వినాయక, సరస్వతి, చిత్రగుప్త పూజలు.

వైశాఖం : నిరుత్సాహంతో అనేక విధములు అనారోగ్య సమస్యలు వెంటాడగలవు. తెలియని ఆర్థిక సమస్యలు. పరిస్థితులు అర్థం కావు. భయం, నిర్లక్ష్యం వదిలి చాకచక్యంగా ఉండాలి అనుకుంటే నవగ్రహ ప్రదక్షిణలు, జపదానములు ఆచరించండి.

జ్యేష్టం : ఉన్న డబ్బంతా ఖర్చు చేస్తారు. చాలా జాగ్రత్తగా ఏది కొనాలన్నా పరిపరి విధాల ఆలోచన చేయండి. మాకు దొరికిందే చాలు అనుకుంటే నష్టం. సూర్య ఆరాధనతో నష్టములు తీరును. సూర్యదేవాలయం దర్శనం చేసుకోండి.

ఆషాఢం : కొన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నవి. గ్రామదేవతల అనుగ్రహం కొరకు అమ్మను ఆరాధించుకొనగలరు. ఆకస్మికంగా ఆదాయం. ప్రయాణములు వాయిదా వేయండి. ఆదివారం పూజలు చేయండి.

శ్రావణం : వివాహ ప్రయత్నములు ఫలించగలవు. బంధుమిత్రుల అభినందనలు. ప్రతి విషయంలో అనుకూలత. ఆర్థికపరమైన సమస్యలు. సరస్వతీదేవి కవచం, లక్ష్మీదేవి కవచం, కనకధార స్తోత్రములు చేయండి.

భాద్రపదం : వివాహ ప్రయత్నములు చేయండి ఫలితం పక్కనే ఉంటుంది. జాతకం చూడకుండా వివాహములు చేయరాదు. అనారోగ్య సమస్యలు ఉన్నవి. జాగ్రత్తలు తీసుకొనగలరు. వినాయక లక్ష్మీనారాయణులకు యజ్ఞం చేయండి.

ఆశ్వయుజం : దుర్గాదేవి పూజలు చేయుట దర్శనం వలన ప్రతి విషయంలో ప్రగతి ఉంటుంది. శుభవార్తలు విందువినోదములు ఆర్థికంగా సంతృప్తి ఉంటుంది. ఆనందంగా ఉంటారు. యోగ, ధ్యానం చేయండి.

కార్తీకం : సంఘంలో గౌరవ మర్యాదలు. వ్యాపార లాభములు. అధిక ఖర్చులు. శత్రువులను అలా ఉంచండి. వాళ్లే మీదారికి వస్తారు. అసలు ఏమి అర్థం కాదు. అప్పులు చేయవలసి వస్తుంది. నవగ్రహ ఆరాధన చేయండి.

మార్గశిరం : బంధుమిత్రుల కలయిక విశేషమైన పరిణామాలు. ఆనందంగా గడపగలరు. సంగీత సాహిత్యములందు అనుకూలత. లలిత కళలను ఇష్టంగా తిలకించగలరు. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయించండి. 

పుష్యం : విలాసంగా ఉండాలని కోరికలు కలుగును. బంధుమిత్రుల కలయిక. స్థిరాస్థి విషయాలు కలసి రాగలవు. సుఖసంతోషాలను ప్రోత్సహించి అదనంగా ధనం ఖర్చు చేయగలరు. ఆదిత్య హృదయ పారాయణ చేయండి. 

మాఘం : భార్యాభర్తలు అనురాగంతో ఉండగలరు. ఆకస్మికంగా నూతన స్నేహములు, తీర్థయాత్రలు, విందువినోదములు. ఆర్భాటపు ఖర్చులు హుందాతనమునకు అధిక ధన వ్యయం. ఇష్ట దేవతల ఆరాధన శాంతినిస్తుంది.

ఫాల్గుణం : ఇష్టదేవతలను ప్రతి నిమిషంలో స్మరించగలరు. ప్రతి విషయంలో దైవబలం కావాలి. ఆర్థిక పెంపు గురించి ఆలోచన చేయండి. తొందరపాటు తగదు. అవసరమైనప్పుడు పెద్దల సలహాలు తీసుకొనగలరు. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.