శ్రీ క్రోధి నామ పంచాంగం : ధనస్సు రాశి ఉద్యోగులు  జాగ్రత్తగా ఉండాలంట

శ్రీ క్రోధి నామ పంచాంగం : ధనస్సు రాశి ఉద్యోగులు  జాగ్రత్తగా ఉండాలంట

ఆదాయం : 11
వ్యయం      : 5
రాజపూజ్యం : 7
అవమానం  : 5

మూల 1, 2, 3, 4 పాదములు; పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు; ఉత్తరాషాఢ 1వ పాదము. మీ పేరులో మొదటి అక్షరం యే, యో, బా, బి, భూ, ధా, భ, ధా, బే

గురువు 9.4.2024 నుండి 1.5. 2025 వరకు మేషరాశి యందు తదుపరి ఉగాది వరకు సువర్ణమూర్తిగా సంచారం. శని 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచారం. రాహుకేతువులు 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు రజిత మూర్తులుగా సంచారం.

ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలం. రైతులకు దిగుబడి చాలా సంతృప్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారులు సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది కాని ఏసీబీ దాడులు ఉండగలవు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. లాయర్లు, డాక్టర్లకు చాలా అనుకూలం. కాంట్రాక్టర్లకు అనుకూలమైన రోజులు. రాజకీయ నాయకులు రెండు చేతులతో సంపాదించగలరు.

విద్యార్థులకు సామాన్య మార్కులు. నిరుద్యోగులకు సామాన్యం. కళాకారులకు సామరస్యం. సినీ పరిశ్రమ అర్థం కాదు. బిగ్ ఇండస్ట్రీ వారికి అనుకూలం. స్మాల్ ఇండస్ట్రీ వారికి సామాన్యం. జనజీవనం అర్థంకాదు. వెండి, బంగారం ధరలు అర్థం కావు. టింబర్ ధరలు నిలకడగా ఉండవు. కిరాణ ఫ్యాన్సీ సుగంధ ద్రవ్యములు ధరలు పెరుగును. ధరలు నిలకడగా ఉంచరు. తెలియని అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణములు. కెమికల్ ఇండస్ట్రీ వారికి అనుకూలం. శత్రుబాధలు. ఏవిధంగా ఆలోచన చేసినా డబ్బు విషయంలో ఇబ్బందులు తప్పవు.

ఎప్పుడు, ఏ సందర్భంలోనైనా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ వనరులు బాగుంటాయి. ఖర్చు ఏవిధంగా అనేది తెలియదు. ఆకస్మిక ఆదాయం ఆర్భాటాలు ఎక్కువనే చెప్పాలి. అన్ని రంగాల వారికి డబ్బు వస్తుంది. మానసిక ప్రశాంతత ఉండదు. ఏవిధంగా ఆలోచించినా ఏదో ఒక సమస్య ఉంటుంది.  కళాకారులకు పని ఒత్తిడి ఉంటుంది. కాని డబ్బు రాదు. కవులకు ఇష్టాగోష్టి విషయంలో గౌరవ మర్యాదలు పెరుగును. ఆర్థిక విషయంలో రాణింపు ఉండదు. మూల నక్షత్రం వాళ్లు జాతి వైఢూర్యం ధరించండి. చిత్రగుప్త దేవాలయంలో ఏడు బుధవారములు పూజలు చేయండి.

ప్రతి రోజు వినాయక, సరస్వతి దేవికి ఆరాధన వలన అనుకూలంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్లు వజ్రం ధరించవలెను. లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, లక్ష్మీ కవచం పారాయణ చేయగలిగితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోగలవు. కనకధార స్తోత్ర పారాయణంతో ఆర్థిక ఇబ్బందులు తొలగును. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్లు జాతి కెంపు ధరించగలరు. ఆదివారం నియమాలు పాటించండి. ఆదిత్య హృదయం పారాయణ, సూర్య దండకం, ఓం శ్రీ సూర్యనారాయణ నమః నామ పారాయణ నిరంతరం చేయుట వలన ఆనందం, ఆరోగ్యం ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణ, జపాలు, దానములు చేయుట వలన ఎంతటి ఇబ్బందులు వచ్చినా తొలగిపోవును. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం,12 సార్లు సూర్య నమస్కారములు చేయండి. అనుకూలంగా ఉంటుంది. 
అదృష్ట సంఖ్య 3.

చైత్రం : ఈ రాశి పురుషులకు అనుకూలంగా ఉన్నది. ప్రయత్న లోపం లేకుండా కార్యసాధనలో ముందుకు సాగండి. గౌరవానికి భంగం లేదు. వృత్తి వ్యాపారాలందు అనుకూలం. అందరిని కలుపుకొని ముందుకు సాగండి. వినాయక, సరస్వతి, చిత్రగుప్తుని పూజలు చేయండి. 

వైశాఖం : ఆర్థిక వెసులుబాటు. శ్రమకు తగిన ఆదాయం. ఏ విధంగా ఆలోచించినా అన్ని రంగాల్లో అభివృద్ధి. స్థిరాస్తులు పెంచగలరు. అధిక వనరులు సమకూరగలవు. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. 

జ్యేష్టం: ఆకస్మిక ధనలాభం. ప్రతి విషయంలో ఇంట్లో వాళ్ల మద్దతు. పిల్లల విషయంలో శ్రద్ధ అవసరం. కార్యరంగంలో సమర్ధులుగా ఉంటారు. లక్ష్మీనారాయణ పారాయణం చేయండి.

ఆషాఢం : ఏ విధమైన లోటు లేకుండా ఆర్థికంగా నిలదొక్కుకొనగలరు. సంతృప్తికరంగా కాలం గడువగలదు. అప్పుడప్పుడు కొన్ని గంటలు ఏదైనా బాధ కలిగినా ధైర్యంగా ముందుకు సాగండి. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

శ్రావణం : భూములు, గృహం ఖరీదు చేయగలరు. ఉద్యోగంలో ప్రమోషన్. వ్యక్తిగతంగా ఎన్నడూ లేనంత సమర్ధవంతంగా అభివృద్ధి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎదురుండదు. సత్యదేవుని వ్రతం చేయండి.

భాద్రపదం : తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అన్నిరకముల పండ్ల రసములతో అభిషేకం, పంచామృతాభిషేకం, హోమం, శరవణభవ అనే నామ జపం చేయండి.

ఆశ్వయుజం : ప్రతి విషయంలో ముందడుగు. పెండింగ్, ఆగిపోయిన పనులను ప్రారంభించి ఎలాంటి భయం లేకుండా ముందుకు సాగండి. సూర్యనారాయణ నమస్కారములు చేయండి.

కార్తీకం : ధైర్యంగా ముందుకు సాగాలి. అనుకూలమైన రోజులు. తలపెట్టిన పనులు విజయవంతం. వస్తువాహన, గృహనిర్మాణం, అలంకరణ విషయంలో సమకూర్చుకొనగలరు. వినాయక, సరస్వతి, చిత్రగుప్తుని ఆరాధించండి.

మార్గశిరం : వృత్తి, వ్యాపారులకు అనుకూలం. అన్ని రంగాల్లో ఉన్నవాళ్లకి, ఉద్యోగం లేనివాళ్లకి ఉద్యోగం, ప్రమోషన్ వస్తాయి. వ్యాపారంలో లాభాలు. సరస్వతీ కవచం, లక్ష్మీ కవచం, కనకధార స్తోత్రం పఠించండి.

పుష్యం : దూర ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. అనారోగ్య సూచనలు. ఖర్చులు వాయిదా వేయుట మంచిది. ఆర్భాటాలకు సమయం కాదు.  తెలియని విషయములతో మాట్లాడరాదు. సూర్యుని ఆరాధన చేయండి.

మాఘం : ఈ రాశి వారికి శుభకార్యములు. ఏ విషయంలో ఏదో తెలియని విధంగా వాయిదా పడే అవకాశం. ధనధాన్యాలకు లోటు ఉండదు. చాలా అనుకూలమైన రోజులుగానే ఉంటుంది. కాని ముందుచూపుతో ఆలోచన చేయండి.

ఫాల్గుణం : వాక్చాతుర్యం ఉంటుంది. అలంకరణ విషయంలో శ్రద్ధ ఉంచగలరు. ఆకర్షణీయంగా వస్త్రాలు ధరించగలరు. ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. సరస్వతి, లక్ష్మీ, కుబేరులకు పూజలు చేయండి.