
గాజా స్ట్రిప్: గాజాలోని పలు ప్రాంతాల్లో సాయం కోసం ఎదురు చూస్తూ ఆదివారం ఒక్కరోజే 73 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఉత్తర గాజాలో ఎక్కువమంది చనిపోయారని చెప్పింది. ఇజ్రాయెల్ బార్డర్ జికిమ్ క్రాసింగ్ ద్వారా ఉత్తర గాజాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు 67 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. మరో 150 మందికిపైగా గాయపడ్డారని.. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది.
ఇజ్రాయెల్ ఆర్మీ, సాయుధ ముఠాలు దాడులు చేయడంతోనే వీరు మరణించారా అనేది స్పష్టంగా తెలియలేదు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఈ మరణాలకు ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులే కారణమని చెప్పారు. ఈ ఆరోపణలపైన కానీ, పౌరుల మరణాలపై కానీ ఇజ్రాయెల్ మిలిటరీ ఇప్పటివరకూ స్పందించలేదు.