
ఇస్లామాబాద్/కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దారుణం జరిగింది. ఆర్మీ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. మరో 38 మంది పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటన ఖుజ్దర్ జిల్లాలో జరిగింది. పిల్లల బ్యాగులు, షూస్, రక్తంతో ఘటనా స్థలమంతా హృదయ విదారకంగా మారింది.
బుధవారం ఉదయం పిల్లలను తీసుకుని స్కూల్‌కు బయలుదేరిన బస్సుపై మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని బలూచిస్తాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. ‘‘ఆర్మీ స్కూల్ బస్సు లక్ష్యంగా మిలిటెంట్లు ఐఈడీ బాంబుతో సూసైడ్ అటాక్ చేశారు. ఆ టైమ్‌లో బస్సులో 46 మంది ఉన్నారు. దాడిలో బస్సు డ్రైవర్, హెల్పర్, నలుగురు చిన్నారులు చనిపోయారు. మరో 38 మంది పిల్లలు గాయపడ్డారు” అని వెల్లడించారు.
ఐఈడీ బాంబుతో అటాక్..
క్వెట్టా, కరాచీ హైవేపై దాడి జరిగిందని ఖుజ్దర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ దస్తీ తెలిపారు. గాయపడిన చిన్నారులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన పిల్లలను ఎయిర్ అంబులెన్స్‌లో క్వెట్టాకు తరలించామని వెల్లడించారు. ఐఈడీ అమర్చిన వెహికల్‌తో బస్సును ఢీకొట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ దాడిని పాక్ ప్రెసిడెంట్ అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు.
పాక్ నిందలు.. భారత్ కౌంటర్
ఈ దాడి వెనుక భారత్ ప్రోత్సహిస్తున్న టెర్రరిస్టులు ఉన్నారని పాకిస్తాన్ ఆర్మీ నిందలు వేసింది. పాక్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించింది. దీనికి భారత్ కౌంటర్ ఇచ్చింది. పాక్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ‘‘టెర్రరిజానికి కేంద్రమైన పాకిస్తాన్.. ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్‌పై నిందలు వేయడం అలవాటుగా మార్చుకున్నది. వాళ్ల అంతర్గత సమస్యలన్నింటికీ భారత్‌ను బద్నాం చేస్తున్నది” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.