డెడ్ బాడీల కోసం ఆస్పత్రుల్లో వెతుకులాట.. ఫొటోలతో జల్లెడ పడుతున్న వైనం

డెడ్ బాడీల కోసం ఆస్పత్రుల్లో వెతుకులాట.. ఫొటోలతో జల్లెడ పడుతున్న వైనం

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 275మంది మరణించారు. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుతో ఢీకొనడం వల్ల అత్యంత ఘోరమైన ప్రమాదానికి దారి తీసింది. ప్రమాదస్థలానికి సంబంధించిన విజువల్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రయాణికుల మృతదేహాలు, చిందరవందరగా పడిన వారి వస్తువులు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఘటనలో ఇంకా 200మంది మృతదేహాలు గుర్తించాల్సి ఉండడంతో.. వారిని ఆస్పత్రిలో ఉంచడం స్థానిక పాలనా యంత్రాంగానికి సవాలుగా మారుతోంది.

జూన్ 4న దాదాపు 110 మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి తరలించగా, మిగిలిన వాటిని క్యాపిటల్ హాస్పిటల్, అమ్రీ హాస్పిటల్, సమ్ హాస్పిటల్, మరికొన్ని ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాల గుర్తింపు కోసం మరో రెండు రోజుల పాటు అక్కడే ఉంచనున్నారు. AIIMSలో చనిపోయిన వారిని గుర్తించడానికి బంధువులు, కుటుంబసభ్యులు వారి ఫొటోలతో ఆత్రుతగా వెతకడం అందర్నీ కలచివేస్తోంది.

తమ్ముడి మృతదేహాన్ని సేకరించేందుకు బాబు సాహెబ్ అనే వ్యక్తి బిహార్ నుంచి ఎయిమ్స్‌కు వచ్చారు. "నా వద్ద అతని ఫోటో ఉంది కానీ నాకు ఎవరూ ఏమీ చెప్పడం లేదు. అతని మృతదేహం ఈ ఆసుపత్రిలోనే ఉంది, కానీ మేము ఆ డెడ్ బాడీని ఇంకా గుర్తించలేకపోయాం" అని అయన చెప్పాడు.

తన సోదరుడి మృతదేహాన్ని ఎయిమ్స్‌లో ఉంచినట్లు తనకు సమాచారం వచ్చిందని, అయితే దానిని ఇంకా కనుగొనలేకపోయానని రాకేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి చెప్పారు. "మా అన్నయ్య మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చినట్లు తెలియడంతో ఎయిమ్స్‌కు వచ్చాను. కానీ ఇక్కడ దొరకడం లేదు. ఇంకా అతని మృతదేహం కోసం వెతుకుతున్నాను" అని ఆయన తెలిపారు.