ప్రస్తుతం రాజకీయాల్లో వారసులకే ఇంపార్టెన్స్

ప్రస్తుతం రాజకీయాల్లో వారసులకే ఇంపార్టెన్స్
  • తామే బరిలో ఉన్నట్లుగా కార్యకర్తలతో సమావేశాలు
  • గెలుపు వ్యుహాలు ప్లాన్ చేస్తూ నేతలను దిశా నిర్దేశం
  • అభ్యర్థులను కలవాలంటే ముందుగా తనయుల దగ్గరకు వెళ్లాల్సిందే..

హైదరాబాద్, వెలుగు: తలపండిన నేతలు కూడా  ప్రస్తుతం రాజకీయాల్లో తమ వారసులకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాబోయే కాలంలో వారసులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే  వారిని  క్రియాశీల రాజకీయాల్లో  కొనసాగేలా ప్రోత్సహిస్తున్నారు.  గ్రేటర్​ హైదరాబాద్ రాజకీయాల్లో ఇప్పుడు వారసుల హవా నడుస్తోంది. పోటీ చేసే అభ్యర్థుల కంటే వారే కొడుకులే ఎక్కువగా  కార్యకర్తలకు ఆదేశాలిస్తున్నారు.  మరికొందరు నాయకుల వారసులు నేరుగా నేతలు, కార్యకర్తలతో  సమావేశాలు నిర్వహిస్తూ  గెలుపు కోసం కృషి  చేస్తున్నారు.  దీంతో పలు సెగ్మెంట్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థుల కంటే వారి వారసుల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది.

గెలుపే లక్ష్యంగా..

గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోని చాలా సెగ్మెంట్లలో అభ్యర్థుల గెలుపు కోసం తనయుల ప్రచారమే అధికంగా కనిపిస్తోంది. ముషీరాబాద్ సెగ్మెంట్​లో 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి ముఠా గోపాల్ విజయం సాధించారు.  అయితే, అప్పట్లోనే ఆయన కుమారుడు జయసింహ తండ్రి గెలుపు కోసం ఎంతో శ్రమించారు. మరోసారి ముషీరాబాద్ సెగ్మెంట్​టికెట్ దక్కించుకున్న ముఠా గోపాల్ విజయం కోసం.. జయసింహ పనిచేస్తున్నారు. సెగ్మెంట్​లోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఏ బూత్‌‌‌‌‌‌‌‌లో ఎన్ని ఓట్లు ఉన్నాయి.  ఎలాంటి వ్యుహాలతో ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నారు. సనత్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్​కు చెందిన ఎమ్మెల్యే, మంత్రి విషయంలోనూ ఆయనకు అండగా కొడుకు, తమ్ముడు ప్రచారం చేస్తున్నారు.  సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వారసులు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సెగ్మెంట్​లో తండ్రికి తోడుగా రాజకీయాలు నడుపుతున్నారు.  ఆయన కుమారులు రామేశ్వర్, త్రినేత్ర సికింద్రాబాద్ సెగ్మెంట్​లో కార్యకర్తలతో సమావేశమవుతూ తండ్రి విజయం కోసం పని చేస్తున్నారు.  కంటోన్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే సాయన్న కొంతకాలం కిందట చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన కూతురు, మాజీ కార్పొరేటర్ లాస్య నందిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేసేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నుంచి టికెట్ దక్కించుకున్నారు.  మేడ్చల్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కొనసాగుతున్న మల్లారెడ్డి రాజకీయ వారసుడిగా.. అల్లుడు రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి కొనసాగుతున్నారు. 

Also Read : ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. బయటకు రాకండి

ఆయన గత ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపో యారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావుకు ఆయన కుమారుడు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.  తన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్ కావాలన్న అంశంపైనే పార్టీతో విభేదాలు రావడంతో మైనంపల్లి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంబర్​పేట నుంచి ఎమ్మెల్యే  కాలేరు వెంకటేశ్ సతీమణి కాలేరు పద్మ వారసురాలిగా ఉన్నారు. గతంలో 2015లో గోల్నాక కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆమె విజయం సాధించారు. తాజాగా కాలేరు విజయం కోసం ఆమె పని చేస్తున్నారు.

కాంగ్రెస్​లోనూ వారిదే జోరు..

కాంగ్రెస్​లోనూ వారసుల హవా కొనసాగుతున్నది.  సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ నుంచి గతంలో రెండు సార్లు విజయం సాధించిన ఎం.అంజన్​కుమార్ యాదవ్ ​ఈసారి ముషీరాబాద్ ​అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయన వారసుడిగా  అనిల్ కుమార్​యాదవ్​ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు.  కాంగ్రెస్​ పార్టీ యూత్​ విభాగం అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు.  ఒకవేళ తనకు టికెట్ రాకపోతే  తండ్రి విజయం కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటి నుంచే ఆయన సెగ్మెంట్​లో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

కార్యకర్తల్లో అసంతృప్తి..

గ్రేటర్ పరిధిలోని పలు సెగ్మెంట్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థుల విజయం కోసం వారి వారసులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.  దీంతో  కొన్ని సెగ్మెంట్లలో వారుసుల  తీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఈ విషయాన్ని పలువురు ముఖ్య కార్యకర్తలు అభ్యర్థుల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. అంతా మనోళ్లే కదా  అంటూ వారిని ఎమ్మెల్యే అభ్యర్థులు బుజ్జగిస్తున్నట్లు సమాచారం.  అయితే, వారసుల తీరు శ్రుతి మించితే మాత్రం ఎన్నికల్లో పార్టీకి  తీవ్ర నష్టం వాటిల్లే  ప్రమాదం ఉందని కార్యకర్తలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.