ఆరు గ్యారంటీలపైనే అంతటా చర్చ..హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనం

ఆరు గ్యారంటీలపైనే అంతటా చర్చ..హైదరాబాద్ నుంచి  సొంతూళ్లకు పయనం
  •     డాక్యుమెంట్ల కాపీ కోసం  జిరాక్స్ సెంటర్ల వద్ద జనం హడావుడి
  •     బస్టాండ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ

హైదరాబాద్, వెలుగు : ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలపైనే అంతటా చర్చ జరుగుతుంది. అప్లై చేసుకునేందుకు ఏం కావాలనే దానిపైనే ముచ్చటించుకుంటున్నారు. దరఖాస్తు ఫారాలు ఎక్కడ ఇస్తారో.. ఎలా అప్లై చేసుకోవాలోననే హడావిడిలో జనం ఉన్నారు. సిటీలో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ నడుస్తన్నది. ప్రజాపాలనలో భాగంగా గురువారం నుంచి అప్లికేషన్లు తీసుకుంటుండగా.. అందుకు కావాల్సిన డాక్యుమెంట్లను జిరాక్స్ తీసుకునే  పనిలో జనం ఉన్నారు.  దీంతో బుధవారం ఇంటర్ నెట్, జిరాక్స్ సెంటర్లు రద్దీగా కనిపించాయి. 

జిల్లాల నుంచి సిటీకి వలస వచ్చిన వారు సొంతూళ్ల బాట పట్టారు. రేషన్ కార్డులు గ్రామాల్లోనే ఉండటంతో అప్లై చేసుకునేందుకు తరలివెళ్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు   సెలవులు పెట్టి మరి వెళ్తున్నారు. క్రిస్మస్ కు ముందు నుంచి మరుసటి రోజు వరకు వరుస సెలవులు రావడంతో చాలామంది గ్రామాలకు వెళ్లారు. వెళ్లినవారు ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేందుకు గ్రామాల్లోనే ఉండిపోయారు. 

సొంతూళ్లకు తరలివెళ్తూ.. 

గత ప్రభుత్వం తొలినాళ్లలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే సమయంలో ఏ విధంగానైతే జనం సొంతూళ్ల బాట పట్టారో ఇప్పుడదే తరహాలో ఆరు గ్యారంటీలకు అప్లై చేసుకునేందుకు తరలివెళ్తున్నారు. సిటీలోని ప్రధాన బస్టాపులైన ఎంజీబీఎస్​, జేబీఎస్​, ఉప్పల్, ఎల్బీనగర్, లింగంపల్లి, మెహిదీపట్నం, ఆరాంఘర్, బాలానగర్ తదితర ప్రాంతాలు రద్దీగా కనిపించాయి. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా వందశాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న ఆర్టీసీ  బస్సులు ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు చేసుకునేందుకు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కొందరు ఎదురు చూడలేక ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్తున్నారు. 

ఒకరోజు ముందు నుంచే హడావుడి 

 ఆరుగ్యారంటీలకు అప్లై చేసుకునేందుకు హడావిడిలో పడ్డారు. ఇంటర్నెట్ సెంటర్ల వద్ద రేషన్ కార్డు ప్రింట్ల కోసం క్యూ కట్టారు. ఆధార్ కార్డుల జిరాక్స్​లు, ఫొటోల కోసం ఫోటో స్టూడియోల వద్ద బారులు తీరారు. ప్రధానంగా దరఖాస్తు కోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోలను జిరాక్స్ లను  తీసుకొని దరఖాస్తు చేసుకునేందుకు రెడీ అయ్యారు. కొందరు ఎక్కడ దరఖాస్తు చేయాలో తెలియక తెలిసిన వారికి ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు.