పాత రేటుకే గెలలు దిగుమతి చేసుకోవాలి

పాత రేటుకే గెలలు దిగుమతి చేసుకోవాలి

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ఆందోళన

అశ్వారావుపేట, వెలుగు: మూడు రోజుల క్రితమే తాము ఫ్యాక్టరీకి ఆయిల్​పామ్ ​గెలలు తెస్తే అన్​లోడ్​ చేయలేదని, ఇప్పుడు కొత్తరేటు ప్రకారం తీసుకుంటే రూ. 60 లక్షల వరకు నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆయిల్​పామ్​ ఫ్యాక్టరీ ఎదుట రైతులు ట్రాక్టర్లు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల వద్ద 500 ట్రాక్టర్లలో సుమారు 2 వేల టన్నుల ఫ్రూట్​తో మూడు రోజులుగా పడి గాపులు పడుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 1 నుంచి కొత్త రేటుపై గెలలను దిగుమతి చేసుకుంటామనడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 28న వచ్చిన ట్రాక్టర్లను అక్టోబర్ 1న అన్​లోడ్​చేయడం వల్ల తాము టన్నుకు రూ. మూడు వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. సీరియల్ నంబర్ ప్రకారం సెప్టెంబర్ 28న వచ్చిన ట్రాక్టర్లకు పాత రేటు నిర్ణయించి దిగుమతి చేసుకోవాలన్నారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 

భారీగా తగ్గిన గెలల ధర

అక్టోబర్​​ నెలలో ఆయిల్ పామ్​ గెలల ధర భారీగా తగ్గింది. సెప్టెంబర్​ నెలలో టన్నుకు రూ. 16,295 ఉండగా అక్టోబర్​ నెలలో టన్నుకు రూ.3,300 తగ్గి రూ.12,995కు చేరినట్లు ఆయిల్ ఫెడ్ సీనియర్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్​ నెలలో ఫ్యాక్టరీకి  గెలలు తరలించిన రైతులకు తగ్గిన రేటు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.