జీ 20 సదస్సులో మోడీ, బైడెన్ మధ్య ఆత్మీయ సంభాషణ

 జీ 20 సదస్సులో మోడీ, బైడెన్ మధ్య ఆత్మీయ సంభాషణ

బాలి : ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతున్న జీ 20 కూటమి దేశాల సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. ఈ సదస్సులో ఇద్దరూ అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ట్విట్టర్ లో షేర్​ చేసింది. బాలిలో జరుగుతున్న జీ 20 సదస్సులో భాగంగా మోడీ, బైడెన్​ మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందని పీఎంఓ పేర్కొంది. 

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారమే ఇండోనేషియా వెళ్లారు. ఇండోనేషియాలోని బాలిలో ఇవాళ, రేపు జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో పాల్గొంటారు. 

కీలక అంశాలపై చర్చలు

ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై జీ20 సదస్సులో ప్రపంచ నేతలతో ప్రధాని మోడీ చర్చించనున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా–-ఉక్రెయన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత, ఆహార భద్రత సవాళ్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం వంటి కీలక అంశాలపై జీ20 సదస్సులో రెండు రోజుల పాటు చర్చించనున్నారు. 

ఇండోనేషియా నుంచి భారత్‌కు అధ్యక్ష బాధ్యతలు
20 దేశాల కూటమి అయిన జీ 20..  18వ సదస్సుకు 2023లో భారత్‌ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులో ఇండోనేషియా నుంచి సారథ్య బాధ్యతలను భారత్‌ అందుకోనుంది.

సునాక్‌తో ప్రత్యేకంగా భేటీ..!
జీ 20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీకానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. దీంతో అందరి దృష్టి భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో మోడీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఉంటుందో లేదో ఇరుపక్షాలు కూడా స్పష్టం చేయలేదు.