
మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘అతడు’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకురాబోతోంది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై మురళీ మోహన్ నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 9న మహేష్ బర్త్ డే కానుకగా సూపర్ 4కే క్వాలిటీతో రీ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఎక్సెల్ బ్యానర్‌పై జితేంద్ర గుండపనేని ఈ మూవీ రీ రిలీజ్ రైట్స్ ను తీసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మురళీ మోహన్ మాట్లాడుతూ ‘2005లో మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేశాం. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన పుట్టినరోజుకి రీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది.
అప్పట్లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసి, మా సంస్థకు గౌరవాన్ని తీసుకొచ్చింది. కమర్షియల్‌గా ‘అతడు’ పట్ల మేం సంతృప్తిగానే ఉన్నాం. మేం తీసిన అన్ని చిత్రాలు ఒకెత్తు.. ‘అతడు’ ఇంకో ఎత్తు. అప్పటికే అధునాతన సాంకేతికతో ఈ మూవీని తీశాం. ఇప్పుడు టెక్నాలజీ పరంగా మరింత అప్‌గ్రేడ్ చేసి విడుదల చేస్తున్నాం. మహేష్, త్రివిక్రమ్ డేట్స్ ఇస్తే ‘అతడు’ సీక్వెల్ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.
ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని 8కే, సూపర్ 4కేలోకిఈ చిత్రాన్ని మార్చామని జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల అన్నారు. ‘అతడు’ రీ రిలీజ్ మహేష్ ఫ్యాన్స్‌కు పాత రోజులు గుర్తు చేస్తుందని నిర్మాత జితేంద్ర అన్నారు. రీ రిలీజ్ ద్వారా వచ్చిన డబ్బును మహేష్ బాబు ఫౌండేషన్ కోసమే వాడుతున్నామని ఎంబీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ అన్వేష్ చెప్పారు.