కొత్త స్టేషన్లు లేనట్టేనా? .. గస్తీ లోపంతో పెరుగుతున్న నేరాలు

కొత్త స్టేషన్లు లేనట్టేనా? .. గస్తీ లోపంతో పెరుగుతున్న నేరాలు
  • ఎనిమిదేళ్లుగా కాగితాలకే పరిమితమైన ప్రపోజల్స్‌‌
  • వరంగల్ సిటీలోని స్టేషన్లపై ఓవర్‌‌ లోడ్‌‌
  • లా అండ్​ఆర్డర్‌‌తో పాటు ట్రాఫిక్‌‌ ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు : వరంగల్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో ఏటికేడు క్రైమ్‌‌ రేటు పెరిగిపోతోంది. నగరంలోని కొన్ని స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉండడం, గస్తీ నిర్వహించేందుకు సిబ్బంది కూడా తగినంతగా లేకపోవడంతో నిత్యం ఏదో ఒక చోట చోరీలు, మర్డర్లు, అల్లర్లు, గంజాయి గ్యాంగులు, మందుబాబుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. నేరాలను నియంత్రించేందుకు గతంలో ప్రతిపాదించిన కొత్త పోలీస్‌‌స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ కాగితాలకే పరిమితమైంది. ప్రపోజల్స్​పంపించి ఎనిమిదేండ్లు దాటినా ఇప్పటివరకు సర్కార్‌‌ గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇవ్వకపోవడంతో ఉన్న స్టేషన్లపైనే భారం పడుతోంది. ఇటీవల నగరంలో చోరీలు, నేరాలు పెరగడంతో కొత్త స్టేషన్ల ఏర్పాటు అంశంపై మళ్లీ చర్చ జరుగుతోంది.

గ్రేటర్‌‌ సిటీనే కీలకం

వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిని కలిపి 2015లో వరంగల్‌‌ కమిషనరేట్‌‌ను ఏర్పాటు చేశారు. కమిషనరేట్‌‌ పరిధిలో మొత్తం 53 పోలీస్‌‌ స్టేషన్లు ఉండగా, లా అండ్‌‌ ఆర్డర్‌‌, ట్రాఫిక్, టాస్క్‌‌ఫోర్స్‌‌, సీసీఆర్‌‌బీ, ఐటీ కోర్‌‌, స్పెషల్‌‌ పార్టీ ఇలా అన్ని విభాగాల్లో కలిపి సుమారు 3 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. కమిషనరేట్‌‌లో గ్రేటర్‌‌ సిటీనే కీలకం. నగరంలోని కొన్ని స్టేషన్ల పరిధిలో నిత్యం ఏదో ఒక క్రైమ్‌‌ జరుగుతోంది. 

ముఖ్యంగా అత్యాచారాలు, కిడ్నాప్‌‌లు, కత్తులతో దాడులు, మర్డర్లు, సూసైడ్స్‌‌ ఇలా వివిధ కారణాలతో వారంలో కనీసం రెండుసార్లైనా వరంగల్‌‌ సిటీలోని మిల్స్​కాలనీ స్టేషన్‌‌ వార్తల్లో నిలుస్తోంది. గంజాయి గ్యాంగుల అల్లర్లు, మద్యం మత్తు గొడవలూ ఇక్కడ ఎక్కువగానే జరుగుతుంటాయి. 

 

Also Raed:బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు.. ఎలా తయారుచేయాలంటే..

గత నెలలో ఒకే వారంలో రెండు మర్డర్లు జరిగాయి. అలాగే సుబేదారి పీఎస్‌‌ పరిధి ఎక్కువగా ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టరేట్లు, సీపీ ఆఫీస్, వివిధ పార్టీల ఆఫీసులు అన్నీ ఈ స్టేషన్‌‌ పరిధిలోకే ఉన్నాయి. దీంతో తరచూ 
ఆందోళనలు, నిరసనలతో ఈ స్టేషన్‌‌పైనా భారం పడుతోంది.

ఎనిమిదేళ్లుగా సర్కారు వద్దే ప్రపోజల్స్

కమిషనరేట్‌‌ ఏర్పడిన కొత్తలో అప్పటి సీపీ సుధీర్‌‌బాబు లా అండ్‌‌ ఆర్డర్‌‌, ట్రాఫిక్, సరిపడా సిబ్బంది కోసం ప్రపోజల్స్‌‌ పంపించారు. కొత్తగా ఏర్పడిన ఐనవోలు, దామెర, వేలేరు, తరిగొప్పులలో కొత్త స్టేషన్లు ఏర్పడినప్పటికీ, నగరంలో స్టేషన్ల ఏర్పాటుకు ఆఫీసర్లు పంపిన ప్రపోజల్స్‌‌ను మాత్రం పెండింగ్‌‌లో పెట్టారు. ఇటీవల ఇంతేజార్‌‌ గంజ్‌‌ పరిధిలో ఏనుమాముల స్టేషన్, కమిషనరేట్‌‌లో బిల్డింగ్‌‌లో సైబర్​స్టేషన్‌‌ మినహా మిగతావన్నీ కాగితాల దశలోనే ఆగిపోయాయి.

 మిల్స్​కాలనీ పరిధిలో లేబర్‌‌ కాలనీ, సుబేదారి పరిధిలోని న్యూ శాయంపేటలో లా అండ్‌‌ ఆర్డర్‌‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా ఇంతవరకూ ఆమోదానికి నోచుకోలేదు. వీటితో పాటు జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట, ఆత్మకూరు, గీసుగొండ, కేయూ పరిధిలో ట్రాఫిక్‌‌ స్టేషన్లు అవసరమని ప్రతిపాదించారు. సిటీలో ప్రస్తుతం రెండు మహిళా స్టేషన్లు ఉండగా నిత్యం వందల ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మరో మహిళా స్టేషన్‌‌ అవసరం ఏర్పడింది. కానీ ఆఫీసర్లు పంపిన ప్రతిపాదలన్నింటినీ సర్కార్‌‌ పెండింగ్‌‌లో పెట్టింది.

ఇప్పట్లో లేనట్టేనా ?

గ్రేటర్​హైదరాబాద్ పరిధిలో దాదాపు 40 పోలీస్​స్టేషన్ల ఏర్పాటుకు ఇటీవల జీవో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌‌ కమిషనరేట్ ప్రపోజల్స్‌‌ను మాత్రం పట్టించుకోలేదు. దీంతో కొత్త స్టేషన్ల ఏర్పాటు ఇప్పట్లో కష్టమేనని పోలీస్‌‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కమిషనరేట్‌‌లో పరిధిలో ఏటా దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, దాడులు, కిడ్నాప్‌‌లు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు, నిరంతరం గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.