- ఏకగ్రీవంగా ఆమోదించిన ఆప్ ఎమ్మెల్యేలు
- సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
- ఎల్జీ వీకే సక్సేనాను కలిసి రిజైన్ లెటర్
- ఈ నెల 26,27 తేదీల్లో అసెంబ్లీ స్పెషల్ సెషన్
- అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం
- టీచర్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆతిశి
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశి మర్లెనా సింగ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ నివాసంలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఢిల్లీ సీఎంను కేజ్రీవాల్ ఎన్నుకుంటారని పార్టీ సీనియర్ లీడర్ దిలీప్ పాండే మీటింగ్‌లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆతిశి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. పార్టీ ఎమ్మెల్యేలంతా నిలబడి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తర్వాత సాయంత్రం కేజ్రీవాల్, ఆతిశితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అయ్యారు. అర్వింద్ కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. కేజ్రీవాల్ రాజీనామాను ఎల్జీ ఆమోదించాక.. త్వరలోనే ఆతిశి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఆతిశి కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవి ఉండదని సమాచారం. సెప్టెంబర్ 26 – 27వ తేదీల్లో జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో 43 ఏండ్ల ఆతిశి... ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
ఆతిశినే ఎందుకు?
సీఎం రేసులో కేజ్రీవాల్ భార్య సునీత సహా పలువురి పేర్లు వినిపించాయి. కానీ.. చివరికి ఆతిశి మర్లెనాకు అవకాశం దక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక.. పాలన కుంటుపడకుండా ఆతిశినే చూసుకున్నారు. మంత్రి సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి పార్టీని ముందుకు నడిపారు. వివాదాలకు దూరంగా ఉంటారని ఆమెకు పేరున్నది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం, ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై అధ్యయనం, ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలనే మార్చేసిన ఘనత ఆమెది. దీనికితోడు గుక్కతిప్పకుండా ఏ విషయమైనా సూటిగా మాట్లాడటం ఆమె ప్లస్ పాయింట్. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేంద్రాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. హర్యానా నీళ్లు విడుదల చేయక ఢిల్లీ వాసుల గొంతెండిపోతుంటే ఆమె దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో మొత్తం 14 శాఖలను చూస్తున్నారు.
టీచర్ కుర్చీ నుంచి సీఎం కుర్చీ దాకా..
ఆతిశి మర్లెనా సింగ్, 1981 జూన్ 8న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి ప్రొఫెసర్‌లు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ, ఆక్స్ఫర్డ్ నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సమీపంలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్‌లో కొన్నేండ్లు హిస్టరీ, ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై స్టడీ చేశారు. 2015లో మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా జిల్లాలో జరిగిన జల్ సత్యాగ్రహ్‌లో పాల్గొన్నారు. ఆ టైమ్‌లో ఆప్ సభ్యులతో పరిచయాలు ఏర్పడి.. పార్టీ ఆవిర్భావ సమయంలో సభ్యత్వం తీసుకున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కేజ్రీవాల్ కేబినెట్లో మంత్రి అయ్యారు.
ఢిల్లీకి మూడో మహిళా సీఎం
ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా ఆతిశి త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్, బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్ ఢిల్లీకి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇద్దరితో పోలిస్తే 43 ఏండ్ల ఆతిశి.. ఢిల్లీకి యంగెస్ట్ సీఎం. 60 ఏండ్ల వయస్సులో షీలా దీక్షిత్, 46 ఏండ్ల వయస్సులో సుష్మా స్వరాజ్ సీఎంలు అయ్యారు.
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
సీఎం పదవికి అర్వింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు శాసనసభాపక్ష నేత ఆతిశి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కేజ్రీవాల్ ఎల్జీ నివాసానికి వెళ్లారు. అక్కడ తన రాజీనామా లేఖను అందజేశారు. ఆ తర్వాత ఆతిశి ఎల్జీని కలిసి, కొత్త సీఎంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తనకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తూ సంతకం చేసిన పత్రాన్ని ఎల్జీకి అందించారు.
మీ కొడుకును మళ్లీ సీఎంను చేయండి: ఆతిశి
ఢిల్లీ ప్రజల కొడుకు, సోదరుడు అయిన అర్వింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ సీఎంగా గెలిపించాలని ఆతిశి అన్నారు. శాసనసభాపక్ష భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు నా గురువైన అర్వింద్ కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు. నాపై ఉన్న నమ్మకంతో ఆప్ నేతలు అవకాశం ఇచ్చారు. కేజ్రీవాల్ రాజీనామా చేయడం బాధాకరం. సీఎం అయినందుకు నన్ను అభినందించొద్దు. వచ్చే ఏడాది ఫిబ్రరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను అధికారంలోకి తీసుకొచ్చి కేజ్రీవాల్‌ను సీఎం చేయడమే నా లక్ష్యం’’ అని ఆతిశి చెప్పారు. తప్పుడు కేసులో కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్‌ను ఆరు నెలల పాటు జైల్లో పెట్టిందని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం.. బీజేపీ, దర్యాప్తు ఏజెన్సీలకు చెంపపెట్టు అని ఫైర్ అయ్యారు.