కేసీఆర్​పై అట్రాసిటీ కేసు పెట్టాలి: ఆకునూరి మురళి

కేసీఆర్​పై అట్రాసిటీ కేసు పెట్టాలి: ఆకునూరి మురళి
  • పదేండ్ల పాలనలో  దగాపడ్డ దళితులు..     
  • వారికి జరిగింది మేడిపండు న్యాయమే: జస్టిస్​చంద్రకుమార్
  • సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బుక్​లెట్ విడుదల

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల కేసీఆర్ పాలనలో దళితులకు జరిగింది మేడిపండులాంటి న్యాయమేనని, దళిత సీఎం నుంచి దళితబంధు వరకు అన్ని బూటకపు హామీలేనని పలువురు వక్తలు మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్​లో మంగళవారం ‘చాటింపు’ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో ‘పదేళ్ల కేసీఆర్ పాలనలో దగాపడ్డ దళితులు’ అనే విమర్శనాత్మక బుక్​లెట్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి తదితరులు బుక్​లెట్​రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా జస్టిస్​ చంద్రకుమార్​ మాట్లాడుతూ.. కేసీఆర్​తీసుకొచ్చిన దళితబంధు పథకం అందని ద్రాక్ష అని, 40 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం చేరడానికి130 ఏండ్లు పడుతుందని ఎద్దేవా చేశారు.  

రూ. 84 వేల కోట్లు దళితులకు బాకీ

రిటైర్డ్​ఐఏఎస్​ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. కేసీ ఆర్​దళితుల కోసం తీసుకొచ్చిన పథకాలను ‘ఆహ నా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాస రావు కోడికూర కామెడీ సీన్​తో పోల్చారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, దళిత బంధు లాంటి హామీలు, పథకాలను చూసి మురవటమే తప్ప, పూర్తిస్థాయి అమలుకు నోచుకోవని ఎద్దేవా చేశారు. క్యారీ ఫార్వర్డ్​ చేయాల్సిన నిధులను దారి మళ్లించడం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని, కేసీఆర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు. 

దాదాపు రూ.84 వేల కోట్లు కేసీఆర్ దళితులకు బాకీ పడ్డారని తెలిపారు. గ్రామ స్థాయిలో దళిత, గిరిజన సర్పంచ్​లను తొక్కెయడానికే వీడీసీ వ్యవస్థను తీసుకొచ్చారని పలువురు వక్తలు మండిపడ్డారు. పదేండ్లలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, ఇప్పటికీ నేరెళ్ల, మంథని మధుకర్​లాంటి కేసులు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దళిత ప్రజాప్రతినిధుల విషయంలో కేసీఆర్ ​వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. 

ఈ కార్యక్రమంలో బుక్​లెట్ ప్రచురణకర్తలు వినాయక్​ రెడ్డి, యాదగిరాచార్యులు, రిటైర్డ్​ ప్రొఫెసర్ ​పద్మజా షా, సీపీఐ(ఎంఎల్)​ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చలపతిరావు, సీపీఐ(ఎంఎల్)​ రాష్ట్ర  నాయకులు ప్రసాద్​, తెలంగాణ జల సాధన సమితి నేత గోవర్ధన్, సీపీఐ రాష్ట్ర నాయకులు సుధాకర్, లచ్చయ్య పాల్గొన్నారు.