ఎమ్మెల్యే విఠల్​రెడ్డి ముందే దళితులపై దాడి

ఎమ్మెల్యే విఠల్​రెడ్డి ముందే దళితులపై దాడి
  • దళితబంధు ఎంపికపై ఫిర్యాదు చేయబోయిన మహిళ 
  • కడుపులో తన్నిన సర్పంచ్
  • మరో నలుగురిపైనా చేయి చేసుకుండు
  • నిర్మల్​ జిల్లా బాసర మండలం కిర్గుల్​(కే) గ్రామంలో ఘటన

భైంసా, వెలుగు: ఎమ్మెల్యే ఎదుటే దళితులపై దాడి చేశాడు బీఆర్ఎస్ సర్పంచ్. మహిళ కడుపులో తన్నాడు. మరో నలుగురిపై చేయిచేసుకున్నాడు. నిర్మల్​జిల్లా బాసర మండలం కిర్గుల్​(కే) గ్రామంలో సోమవారం చోటుచేసుకుందీ ఘటన. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. కిర్గుల్(కే) గ్రామానికి ఐదు దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయి. ఈ యూనిట్లను సర్పంచ్​ తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకే ఇచ్చారు. దీనిపై గ్రామంలోని 25 దళిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

 గ్రామంలో కొత్తగా కట్టబోయే శ్రీరామ మందిరానికి భూమి పూజ చేసేందుకు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ ​రెడ్డి రాగా.. దళితులు ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న సర్పంచ్​ దేవేందర్.. ఎమ్మెల్యే ముందే వారితో గొడవకు దిగాడు. జ్యోతి అనే మహిళ కడుపులో తన్నడంతో ఆమె కిందపడగా గాయాలయ్యాయి. మరో నలుగురిపైనా సర్పంచ్ దాడికి పాల్పడ్డాడు. గాయపడిన వారిని స్థానికులు భైంసా ఏరియా హాస్పిటల్​కు తరలించారు. ఐదు కుటుంబాలు ఓట్లు వేస్తేనే మీరు గెలువలేదని, అందరూ వేస్తేనే గెలిచారని దళితులు ఎమ్మెల్యే విఠల్​ రెడ్డిని నిలదీశారు.