- కర్నాటకలోని అళంద్‌లో 6 వేల ఓట్ల తొలగింపు స్కాం వెలుగులోకి
- ప్రతి ఓటుకు రూ.80 చెల్లించి.. డేటా సెంటర్ నుంచి ఫేక్ దరఖాస్తులు
- బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కాల్చిన ఓట్ల రికార్డులు వెలుగులోకి
- ఆరుగురు అనుమానితుల గుర్తింపు
కలబుర్గి:
ఓట్చోరీతో ప్రజాస్వామ్యంపై బీజేపీ తీవ్రమైన దాడికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ ఓట్ చోరీ కుట్రలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నది. కర్నాటకలోని కలబుర్గి జిల్లా అళంద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగినట్టు బయటపడింది. ఆరు వేలకు పైగా ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర జరిగినట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తులో తేలింది.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా కలబుర్గి నియోజకవర్గం నుంచి పోటీచేసిన సుభాష్ గుత్తేదార్ ఇంటి వద్ద కాల్చిన ఓటర్ల రికార్డులు పెద్దఎత్తున దొరకడంతో ఈ వ్యవహారంలో మరింత సంచలనం సృష్టించింది. ప్రతి ఓటు తొలగింపుకు రూ.80 చెల్లించారని, కలబుర్గిలోని ఓ డేటా సెంటర్ నుంచి ఓట్లు తొలగించాలంటూ ఫేక్ దరఖాస్తులు సమర్పించారని సిట్ అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంలో ఆరుగురు అనుమానితులను సిట్ గుర్తించింది.
త్వరలో బీజేపీ మోసాలు మరిన్ని వెలుగులోకి
కలబుర్గిలో బీజేపీ ఓట్ల చోరీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. “పేదల ఓటు హక్కును డబ్బుతో దోచేస్తున్నారు” అని ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ ఓట్ చోరీతో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడికి పాల్పడుతున్నదని రాహుల్ ఆరోపించారు.
“ఇది ఒక్క అలంద్‌కే పరిమితం కాలేదు, ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి కుట్రలు జరిగాయో త్వరలో బయటపడుతాయి” అని అన్నారు. ప్రజలు బీజేపీ మాయలు, మోసాలు అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడం కోసం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. కర్నాటక సీఐడీ అధికారులు ఇచ్చిన సమాచారంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సుభాష్, అతని కొడుకు, అతని సీఏ ఇండ్లు, ఆఫీసులపై సిట్ రెయిడ్స్ చేసింది. ఈ నియోజకవర్గంలో తొలగించాలనుకున్న ఓట్లు ఎక్కువగా దళిత, మైనారిటీలవే ఉన్నాయని కలబుర్గి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్, రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు.
