మారేడ్ పల్లి ఎస్ఐపై ఎటాక్.. నిందితుల అరెస్టు

మారేడ్ పల్లి ఎస్ఐపై ఎటాక్.. నిందితుల అరెస్టు

మారేడ్ పల్లిలో దుండగులు రెచ్చిపోయారు. కత్తితో దాడి చేయడంతో ఎస్ఐకి  తీవ్రగాయాలయ్యాయి. దాడి జరిగిన అనంతరం కొద్ది గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న డీసీపీ చందన దీప్తి..  ఎస్ఐని పరామర్శించారు. ఎస్ఐ వినయ్ కుమార్, కానిస్టేబుల్ లు బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో  ఓం శాంతి టిఫిన్ సెంటర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నెంబర్ ప్లేట్ లేని వాహనంపై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడాన్ని వారు గుర్తించారు.

వెంటనే ఎస్ఐ వారిని ఆపి వివరాలు సేకరిస్తున్నారు. ఓ వ్యక్తి ఎస్ఐ వినయ్ కుమార్ పై కత్తితో దాడికి దిగాడు. పొట్ట, వీపు భాగంలో గాయాలు కావడంతో రక్తస్రావమైంది. అక్కడనే ఉన్న కానిస్టేబుల్.. ఎస్ఐని గీతా నర్సింగ్ హోంకు తరలించారు. ఎస్ఐ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. దాడికి పాల్పడిన పవన్ సింగ్, సంజయ్ సింగ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీరిద్దరిపై పీడి యాక్టులున్నట్లు తెలుస్తోంది. వీరిని పట్టుకోవడానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.